లవ్‌ జాతకాలు...

రాశి ఏంటో చెబితే ఎవరి జాతకం ఎలా ఉందో చెప్పేస్తారు జ్యోతిష్యులు. ప్రేమ విషయంలోనూ కొన్ని రాశులవారు యమా జోరు మీదుంటారట.

Updated : 10 Feb 2024 08:24 IST

రాశి ఏంటో చెబితే ఎవరి జాతకం ఎలా ఉందో చెప్పేస్తారు జ్యోతిష్యులు. ప్రేమ విషయంలోనూ కొన్ని రాశులవారు యమా జోరు మీదుంటారట. ఏంటా కథ? సరదాగా చదివేయండి మరి!

మేషం: ఈ రాశి వాళ్ల గుండె ఉక్కు కన్నా గట్టిదట. ప్రేమ కోసం గోడ దూకడాలు.. వీపు మోత మోగించుకోవడానికైనా సిద్ధంగా ఉంటారట. గుండే కాదు.. వాళ్ల ప్రేమలో గాఢత కూడా ఎక్కువే. జీవితంలో ఒక్కసారైనా డీప్‌గా లవ్‌లో పడిపోతారట.

వృషభం: సున్నిత మనస్కులు. అమ్మాయిలైతే మనసుకి నచ్చినవాడిని రెక్కల గుర్రం ఎక్కి వచ్చిన యువరాజులా భావిస్తారు. అబ్బాయిలు.. ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అభిప్రాయాల లోతులు.. ఆలోచనల కలబోతలు అయ్యాకే.. ఆచితూచి ప్రేమలో పడతారట.

వృశ్చికం: కళ్లతోనే చూసి ఎదుటివాళ్ల మనసులో ఏముందో పసిగట్టే బాపతు. మాటలతో మాయచేసి ప్రేమ ముగ్గులోకి దించేస్తారట. ప్రేమలో విఫలమైతే.. ‘లైట్‌ లేలో యార్‌’ అనుకునే రకం. ప్రేమకన్నా ఎక్కువగా రొమాన్స్‌కే జై కొట్టే నైజం వీళ్లది.

సింహం: కళ్లతోనే కనికట్టు చేసే కాన్ఫిడెన్స్‌.. సూదంటు చూపులతో ఆకట్టుకునే ప్రతిభ వీళ్ల సొంతం. ఏకకాలంలో నలుగురితో ప్రేమాయణం నడపగల నేర్పరులు. మనసుకి నచ్చితేచాలు.. ఎందరితో అయినా టపీమని ప్రేమలో పడిపోతారట.

తుల: పదిమందితో మాట కలపడం.. నలుగురిని మోహించడం.. ఒక్కరితో ప్రేమలో పడటం.. ఇదీ వరుస. గాఢ అనుబంధాలైనా.. రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌లు అయినా.. అన్నింటికీ జైకొట్టే అపర ప్రేమికులు. ప్రేమలో పడటం.. అందులోంచి బయట పడటం.. వీళ్లకి కన్ను కొట్టినంత తేలిక.

కుంభం: ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లు ప్రేమకి రోల్‌మోడళ్లు. ఒక్కసారి పడితే మళ్లీ బయటికి రాలేరు. ప్రేమాపెళ్లీ, మనసూజీవితం ఒక్కరితోనే అని నమ్ముతారు. వీళ్లలో రొమాంటిక్‌ పాళ్లూ ఎక్కువే. వీళ్ల జంట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ జంటలా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని