మంచోడు మా రేలంగి సర్‌..

అప్పుడు ఇంజినీరింగ్‌ సెకండియర్‌. రాహిల్‌ సర్‌ మాకు డేటా స్ట్రక్చర్స్‌ చెప్పేవారు. ఆయన చాలా సున్నిత మనస్కుడు. ఎవరినీ కోప్పడేవారుకాదు. మొహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది.

Published : 02 Mar 2024 00:36 IST

అప్పుడు ఇంజినీరింగ్‌ సెకండియర్‌. రాహిల్‌ సర్‌ మాకు డేటా స్ట్రక్చర్స్‌ చెప్పేవారు. ఆయన చాలా సున్నిత మనస్కుడు. ఎవరినీ కోప్పడేవారుకాదు. మొహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో రేలంగి మావయ్యలాంటి వారు. స్టూడెంట్స్‌ ఆయనకు చెప్పకుండానే క్లాసు మధ్యలో వెళ్లిపోయినా పట్టించుకునే వారు కాదు. ఓసారి తరగతి జరుగుతుండగానే నేను, నా స్నేహితులు వెనకబెంచీలో కూర్చొని ఫోన్లలో గేమ్‌ ఆడటం ప్రారంభించాం. కాసేపయ్యాక మమ్మల్ని గమనించి దగ్గరికొచ్చారు సర్‌. గేమ్‌ రసవత్తరంగా సాగుతుండటంతో మేం పట్టించుకోలేదు. ఆయన మా దగ్గరికొచ్చి, మాలో ఒకర్ని నిల్చోమన్నారు. బ్లాక్‌బోర్డు మీద రాసిన టాపిక్‌ నుంచి ఒక ప్రశ్న అడిగారు. అసలు మేం పాఠం వింటే కదా.. మావాడు జవాబు కాకుండా ఆయన అడిగిన ప్రశ్ననే తిప్పితిప్పి చెప్పాడు. క్లాసంతా ఒకటే నవ్వులు. సర్‌ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మేం మళ్లీ ఫోన్లలో మునిగిపోయాం. తర్వాత ఈ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా మాకు నవ్వాగేది కాదు. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. తర్వాత సెమిస్టర్‌లో కూడా మళ్లీ ఇంకో సబ్జెక్టు చెప్పడానికి సర్‌ వచ్చారు. మాకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది? కానీ అప్పుడు ఆయన మంచితనాన్ని మేం చాలా అలుసుగా తీసుకోవడం ఏమాత్రం బాగా లేదని ఇప్పుడ నిపిస్తోంది.

- అభితేజ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని