ఖనిజాల కావ్యకి.. ఖజానా ఖాజా రాయు లేఖ

కావ్యా.. బంగారంలాంటి నీ రూపాన్ని ఎప్పుడైతే చూశానో.. లక్షాధికారినైన నేను, కోటీశ్వరుడిగా ఊహించుకోవడం మొదలు పెట్టాను. ఆ సంతోషంతో నీకు వజ్రాల హారం కానుకగా ఇస్తే.. ఖరీదైన బహుమతి అని కూడా చూడకుండా విసిరికొట్టావు.

Published : 16 Mar 2024 00:04 IST

వెరైటీ ప్రేమలేఖ

కావ్యా.. బంగారంలాంటి నీ రూపాన్ని ఎప్పుడైతే చూశానో.. లక్షాధికారినైన నేను, కోటీశ్వరుడిగా ఊహించుకోవడం మొదలు పెట్టాను. ఆ సంతోషంతో నీకు వజ్రాల హారం కానుకగా ఇస్తే.. ఖరీదైన బహుమతి అని కూడా చూడకుండా విసిరికొట్టావు. ముత్యాల హారం చేయిస్తే.. పైత్యం ఎక్కువై పడేశావు. ఆ దెబ్బతో ఐరన్‌లా దృఢంగా ఉండే నా మనసు సొట్టలు పడ్డ ఇత్తడిలా తయారైంది. అయినా ముగ్గురాయిలా కఠినంగా ఉండే నిన్ను ముగ్గులోకి దించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. తవ్వకాల్లో ప్లాటినం అన్వేషిస్తున్నట్టుగా నీ కోసం వీధివీధిలో కాపు కాస్తున్నాను. పోగొట్టుకున్న బంగారంలా జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నాను. రాగి చెంబులో నీళ్లు పోసుకొని నీ పేరు మంత్రంలా జపిస్తున్నాను. రోజూ ఓ పెగ్గు వేసుకొని హాయిగా పడుకునే నేను.. నీ కోసం తిరిగీ తిరిగీ బొగ్గులా మారిపోయాను. నువ్వు నాకు కనిపించక విసిగిస్తున్నా.. కనిపించి ఛీకొడుతున్నా.. గ్రాఫైట్‌ డిజైన్‌లా నీపై నా లవ్‌ గ్రాఫ్‌ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. టంగ్‌స్టన్‌లా అల్పాయుష్షుతో కాకుండా నీతో లైఫ్‌లాంగ్‌ జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాను. జింక్‌లా జంకు లేకుండా నా మీద నీకు ఇష్టం పుట్టి నా చెంత చేరాలని.. ఆ అభ్రకం సాక్షిగా వేడుకుంటున్నాను.

పంపినవారు: నల్లపాటి సురేంద్ర, అనకాపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని