స్వీయ విమర్శకు.. ఇలా చెక్‌!

ఇది ఈ ఇద్దరి సమస్యే కాదు. 35ఏళ్లలోపు యువతలో 21 శాతం మంది స్వీయ విమర్శ (సెల్ఫ్‌ క్రిటిసిజం)తో బాధ పడుతున్నారంటున్నాయి అధ్యయనాలు.

Published : 06 Apr 2024 00:16 IST

  • పాతికేళ్ల వినయ్‌ మహా తెలివైనవాడు, పనిమంతుడు. కానీ మొహమాటం ఎక్కువ. ఎవరితోనూ కలవలేడు. ‘నేనంటే బాస్‌కి ఇష్టముండదు. నాకు పదోన్నతులు రావు’ అని అతగాడి ఫీలింగ్‌.
  • బీటెక్‌ ఫస్టియర్‌ ప్రజ్ఞ కాస్త నలుపు. ‘నేను అందగత్తెను కాదు.. నన్నెవరూ ఇష్టపడరు’ అని తెగ బాధ పడుతుంటుంది.

ది ఈ ఇద్దరి సమస్యే కాదు. 35ఏళ్లలోపు యువతలో 21 శాతం మంది స్వీయ విమర్శ (సెల్ఫ్‌ క్రిటిసిజం)తో బాధ పడుతున్నారంటున్నాయి అధ్యయనాలు. తమలోని లోపాలు తలచుకొని తమలో తామే కుమిలిపోవడం.. పదేపదే విమర్శించుకోవడం.. తమని తాము తక్కువ చేసుకోవడం దీని తీరు. ఇది ప్రమాదకరం. ఎవరైనా మనల్ని విమర్శిస్తే ఎదురుదాడితో సమాధానం చెప్పొచ్చు. మనలోని ఇగోని సంతృప్తి పరచుకోవచ్చు. కానీ మనల్ని మనమే ద్వేషించుకోవడం తీవ్ర ఇబ్బందులపాలు చేస్తుంది అంటారు మానసిక నిపుణులు. ఇది ముదిరితే మానసిక ఒత్తిడి, ఆందోళన, అతిగా తినడం.. ఒక్కోసారి తమని తాము గాయపరచుకోవడం చేస్తారట. లోపాలు, తప్పులు, బలహీనతలు, వైఫల్యాలు పదేపదే గుర్తొస్తుంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. విజయాలు సాధిస్తున్నప్పుడు సైతం.. వాటిని ఆస్వాదించకుండా అందులోని లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తుంటారు.

అడ్డుకట్ట ఇలా..

  • జీవితంలో మనం సాధించిన విజయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటుండాలి. పడక ఎక్కే ముందు ఆరోజు చేసిన మంచి పనులు, ఇతరులకు చేసిన సాయం.. గర్వపడ్డ క్షణాలు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • దగ్గరి స్నేహితుడిలో ఏదో చిన్న లోపం ఉందని దూరం పెడతామా? మాట్లాడకుండా ఉంటామా? అలా మీకు మీరే ఒక మంచి స్నేహితుడిలా భావించుకొని మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆ స్నేహితుడి లోపాలే సవరిస్తున్నానని భావించి దానికి పరిష్కారాలు వెతకండి.
  • గతం తవ్వుకున్నకొద్దీ తప్పులే కనిపిస్తుంటాయి. అది మర్చిపోయేలా ప్రస్తుతంలో జీవించాలి. తీరిక లేకుండా పనిలో ఉండాలి. చేస్తున్న పనిపై దృష్టి పెట్టాలి. ఆలోచనలను చర్యల్లోకి మళ్లించేలా చిన్నచిన్న లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.
  • కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా మనవల్ల కాకపోవచ్చు. అప్పుడు నిపుణుల మాట వినాల్సిందే. ఈ స్వీయ విమర్శ మోతాదు మించి మానసిక రుగ్మతగా మారకముందే మానసిక నిపుణులను సంప్రదించి వాళ్ల సలహాలు తీసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని