మన జిమ్‌లో కొరియన్‌ వ్యాయామాలు

కొరియన్‌ సినిమాలన్నా.. కే పాప్‌ గీతాలన్నా చాలామంది యంగిస్థాన్‌లకు తెగ ఇష్టం. ఇప్పుడు ఆ జాబితాలో కొరియన్‌ వ్యాయమాలు సైతం చేరుతున్నాయి.

Published : 27 Apr 2024 00:04 IST

కొరియన్‌ సినిమాలన్నా.. కే పాప్‌ గీతాలన్నా చాలామంది యంగిస్థాన్‌లకు తెగ ఇష్టం. ఇప్పుడు ఆ జాబితాలో కొరియన్‌ వ్యాయమాలు సైతం చేరుతున్నాయి. అక్కడ బాగా పాపులరైన కొన్ని వర్కవుట్లు మన జిమ్‌ల వరకూ వచ్చేశాయి. అందులో యంగిస్థాన్‌లు ఇష్టపడుతున్నవివి.

జియాంగ్‌సియాంగ్‌: దీన్నే అక్కడ ‘సిన్సియారిటీ వ్యాయామం’ అంటారు. ఎందుకిలా అంటే.. దీని ఉద్దేశం కండలు పెంచడం కాదు.. ఫిట్‌గా ఉండటమే. నిదానమే ప్రధానం అన్నట్టుగా.. నెమ్మదిగా స్ట్రెచింగ్‌ చేస్తూ.. శ్వాస పీల్చుతూ, వదులుతూ.. ఒత్తిడిని తగ్గించుకోవడమే. మెడ, భుజాలు దృఢమవడానికి, శరీరం నియంత్రణలో ఉండేందుకు దీన్ని ఎంచుకుంటారు.

బుచేచుమ్‌ డ్యాన్స్‌: బుచేచుమ్‌ అనేది కొరియాలో ఒక సంప్రదాయ నృత్యం. పండగలు, వేడుకల్లో ఎక్కువ ఈ డ్యాన్స్‌ చేస్తుంటారు. దీనికి కొద్దిపాటి మార్పులు చేసి రూపొందించిందే.. బుచేచుమ్‌ డ్యాన్స్‌ వర్కవుట్‌. చేతి రుమాలు, తేలికపాటి బరువుండే విసనకర్రలాంటి వాటితో చేసే ఈ వర్కవుట్‌ శరీరంలో చురుకుదనం ఉండేలా చేస్తుంది. కార్డియో, స్ట్రెంగ్త్‌ వ్యాయామంగా పని చేస్తుంది. సంగీతానికి అనుగుణంగా నృత్య కదలికలు మార్చుతూ సొంతంగా వర్కవుట్‌ను రూపొందించుకోవచ్చు.

డ్రమ్మింగ్‌ కార్డియో: వంటగదిలోని పళ్లాలు, గరిటెల్లాంటి సామాన్లతో ‘నంటా డ్రమ్మింగ్‌’ అనే మ్యూజిక్‌ ప్రదర్శన చేయడం అక్కడ బాగా పాపులర్‌. మ్యూజిక్‌కి అనుగుణంగా చాలా వేగంగా చేస్తుంటారు. కాళ్లని ఆడిస్తూ.. డ్రమ్‌స్టిక్స్‌ లేదా చెక్క స్పూన్లతో కొడుతూ.. బలమంతా ఉపయోగిస్తూ చేసే ఈ రిథమిక్‌ వర్కవుట్‌ మంచి కార్డియో వ్యాయామంగా పని చేస్తుందట.

సూర్య నమస్కారాలు: మన యోగాలో సూర్య నమస్కారాల్లాగే ‘ది సన్‌ సెల్యూటేషన్‌’ అనే వ్యాయామం అక్కడ చేస్తుంటారు. ముందు నిటారుగా నిల్చొని.. ఒక కాలుని ముందుకి, మరో కాలుని వెనక్కి సాగదీసి తలను సూర్యుడికి అభిముఖంగా పైకెత్తి రెండు చేతుల్ని నమస్కరిస్తున్నట్టుగా ఉంచి.. దీర్ఘ శ్వాస తీసుకోవడమే ఈ వ్యాయామం పద్ధతి. ఇది వెన్నెముక బలానికి.. లోయర్‌ బాడీ దృఢమవడానికి కారణమవుతుంది.

కిగాంగ్‌: కొరియన్‌ సంప్రదాయ మార్షల్‌ ఆర్ట్స్‌ థాయ్‌చిని ఉపయోగిస్తూ చేసే కసరత్తు ఇది. కాళ్లు, భుజాలను విశాలం చేసి.. థాయ్‌ చి పోజులు పెడుతూ గాఢంగా శ్వాసతీసుకుంటూ చేస్తారు. శారీరకంగా, మానసికంగా సమతుల్యం సాధించడానికి ఈ వర్కవుట్‌ ఎక్కువగా చేస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని