Earworm: పదేపదే.. వెంటాడే బాణీ

ఎప్పుడో.. ఎక్కడో ఓ పాట వింటాం. అందులోని ఓ ట్యూన్‌ తెగ నచ్చేస్తుంది. లిరిక్‌లోని ఓ పంక్తి మనసులో నాటుకుపోతుంది. ఎక్కడున్నా పదేపదే ఆ బాణీనే చెవుల్లో మోగుతుంది.

Published : 27 May 2023 00:39 IST

ఎప్పుడో.. ఎక్కడో ఓ పాట వింటాం. అందులోని ఓ ట్యూన్‌ తెగ నచ్చేస్తుంది. లిరిక్‌లోని ఓ పంక్తి మనసులో నాటుకుపోతుంది. ఎక్కడున్నా పదేపదే ఆ బాణీనే చెవుల్లో మోగుతుంది. ఆ లైన్‌ వెంటాడుతూనే ఉంటుంది. గంటలు, రోజులు, ఒక్కోసారి నెలలదాకా! దీన్నే ‘ఇయర్‌ వామ్‌’ అంటున్నారు.

ఈ ఇయర్‌ వామ్‌ మామూలుగా ఉండదు. మెదడుని తొలిచి, అందులో తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది. మాటిమాటికీ తొంగి చూస్తుంటుంది. ఎంతకీ వదలనంటుంది.

సెల్‌ఫోన్‌లో, రెస్టరంట్‌లో, టీవీలో.. ఎక్కడైనా సరే.. ఆ ట్యూన్‌ ఒక్కసారి మనసుకి నచ్చేసిందా? ఇక అంతే.

అయితే ఒకే బాణీ అందరికీ ఒకేలా నచ్చాలని నిబంధనేమీ లేదంటారు మానసిక నిపుణులు. వాళ్ల అభిరుచికి అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోటి నచ్చుతుంది. ఒక్కసారి నచ్చితే.. మెదడులోని శ్రవణ వల్కలం అనే భాగంలో ఆ ట్యూన్‌ నిక్షిప్తం అవుతుందట.

ట్యూన్‌లోని స్వర మాధూర్యం, లయ, లిరిక్స్‌లోని ఏదైనా పంక్తి.. అందులో ఏది మనసుకి బాగా నచ్చితే.. అది మెదడు పొరల్లోకి చేరిపోతుందట.

ఆ ట్యూన్‌ వినగానే మెదడులోని శ్రవణ గ్రంథులు ఉత్తేజం కలిగించే డోపమైన్‌ని విడుదల చేస్తాయి. ఇది మనసుకి ఉల్లాసాన్నిస్తుంది. మళ్లీమళ్లీ అదే బాణీ వినాలనే భావన కలగజేస్తుంది.

ఇయర్‌వామ్‌ భావన ఏర్పడగానే.. మెదడులోని ఆడిటరీ కోర్టెక్స్‌, ప్రిఫ్రంటల్‌ కోర్టెక్స్‌లు.. ఆ ట్యూన్‌ లేదా లైన్‌ల సంకేతాల్ని చిత్రాల రూపంలో భద్రపరుస్తాయి. వాటిని మళ్లీమళ్లీ మెదడుకి పంపి గుర్తుకొచ్చేలా చేస్తాయి.

దూరమిలా..

ఇయర్‌వామ్‌ పెద్ద అనారోగ్యంగా భావించలేం అంటారు వైద్య నిపుణులు. కాకాపోతే దీనితో ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. ఈ ఇయర్‌వామ్‌ భావన ఒక్కోసారి కొన్ని గంటలు, రోజులు ఉంటే.. మరికొన్నిసార్లు నెలలుపాటు మెదడులోనే తిరుగుతూ చికాకు కలిగిస్తుంటుంది. ఇతర పాటలు వినడం, ఏదైనా పనిలో తీరిక లేకుండా ఉండటం.. పుస్తకాలు చదవడం, పజిల్స్‌ పూరించడం.. ఆ ధ్యాసను పోగొడుతుంది. వ్యాయామం, యోగా, ధ్యానం.. సైతం ఇయర్‌వామ్‌కి విరుగుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని