chittoor: మేయర్‌ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు
ప్రధాన నిందితుడికి రూ.70 లక్షల జరిమానా విధింపు
పదేళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతుకం

హత్యకు గురైన కఠారి మోహన్, అనురాధ

ఈనాడు- చిత్తూరు, న్యూస్‌టుడే- చిత్తూరు న్యాయవిభాగం: చిత్తూరు నగర మేయర్‌ కఠారి అనురాధ, ఆమె భర్త, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌ హత్య కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన సూత్రధారి, ఏ1గా ఉన్న మోహన్‌ మేనల్లుడు శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ ఎలియాస్‌ చింటూ, గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి ఎలియాస్‌ రేజర్‌ వెంకటేష్‌ (ఏ2), జయప్రకాష్‌రెడ్డి ఎలియాస్‌ జయారెడ్డి (ఏ3), తోటి మంజునాథ్‌ ఎలియాస్‌ మంజూ (ఏ4), మునిరత్నం వెంకటేష్‌ ఎలియాస్‌ గంగనపల్లి వెంకటేష్‌ (ఏ5)లను మరణించే వరకు ఉరి తీయాలని ఆదేశించింది. చింటూకు రూ.70 లక్షలు, మిగిలిన నిందితులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. చింటూ చెల్లించే  జరిమానాలో రూ.50 లక్షలు మృతుల వారసులు, రూ.20 లక్షలను అప్పట్లో హత్య ఆపడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన వేలూరి సతీష్‌కుమార్‌ నాయుడికి చెల్లించాలని స్పష్టం చేసింది. చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. చిత్తూరు కోర్టు చరిత్రలో ఒకే కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి.

తుపాకులు, కత్తులతో దారుణంగా హత్యలు

2015 నవంబరు 17న ఉదయం 11.45 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్‌ దంపతులను తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి పాశవికంగా హత్య చేశారు. నిందితులు బురఖాలు ధరించి చేతిసంచుల్లో తుపాకులు, కత్తులతో మేయర్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించారు. కఠారి అనురాధను తల, ఛాతీపై కాల్చారు. తనను చంపొద్దని ఆమె వేడుకున్నా చింటూ మనసు కరగలేదు. కసి తీరా కాల్చి ఆమె మరణించిందని రుజువు చేసుకున్నాకే అక్కడి నుంచి కదిలారు. పక్క ఛాంబర్‌లో ఉన్న మోహన్‌ తప్పించుకోవడానికి ప్రయత్నించగా కత్తులతో వెంటాడి నరికి, చంపారు. ఈ ఘటనపై అదేరోజు చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.

57 మంది విచారణ 

ఈ కేసులో 130 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. 57 మందిని న్యాయస్థానం విచారించింది. 2016 ఫిబ్రవరి 18న కోర్టులో ప్రవేశపెట్టిన ఛార్జ్‌షీట్‌లో 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. శ్రీకాళహస్తికి చెందిన కాసరం రమేష్‌ హత్యతో తనకు సంబంధం లేదని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ఉపశమనం లభించింది. మరో నిందితుడు శ్రీనివాసాచారి విచారణ కొనసాగుతుండగానే చనిపోయారు. దీంతో తుది విచారణ నాటికి 21 మంది నిందితులుగా ఉన్నారు. ఏ1 నుంచి ఏ5 వరకు దోషులని, మిగిలినవారిపై అభియోగాలు రుజువు కాలేదని అక్టోబరు 24న జడ్జి తీర్పు ఇచ్చారు. అక్టోబరు 27న ఐదుగురు దోషుల కుటుంబ, సామాజిక, ఆర్థిక, మానసిక స్థితి, జైల్లో ఉన్న సమయంలో వారి ప్రవర్తనపై నివేదికలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా ప్రొబేషన్‌ అధికారి, వైద్య బృందం, జైళ్ల సూపరింటెండెంట్లను న్యాయమూర్తి ఆదేశించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఉరిశిక్ష విధించారు. బాధిత కుటుంబసభ్యులు అనుభవించిన వ్యథను నివేదిక రూపంలో ప్రత్యేక పీపీ శైలజ కోర్టుకు సమర్పించారు. దాన్ని పరిశీలించిన జడ్జి రూ.70 లక్షలు చెల్లించాలని చింటూను ఆదేశించారు.

దోషులు వెంకటా చలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, చంద్రశేఖర్‌

పశ్చాత్తాపం మాటే లేని దోషులు 

జడ్జి ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా దోషుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. చింటూ ఏదో ఘనకార్యం చేసినట్టు చేయి ఊపుతూ, కోర్టు బయట అభివాదం చేశారు. న్యాయస్థానం ప్రాంగణంలోనే వైద్యపరీక్షలు చేసి, వారంట్లు సమర్పించాక ఐదుగురినీ కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కఠారి అనుచరులు బాణసంచా కాల్చి, సంబరాలు చేసుకున్నారు.

తప్పుడు సాక్ష్యం చెప్పిన 14 మందికి నోటీసులు 

ఘటన జరిగిన రోజు మేయర్‌ ఛాంబర్, నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు, అర్జీదారులు ఉన్నారు. అందులో 14 మంది కేసును నీరుగార్చడానికి న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి వీరందరినీ ఎందుకు ప్రాసిక్యూట్‌ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. 10 రోజుల్లోపు వారి చిరునామాలు కోర్టుకు సమర్పించాలని ఒకటో పట్టణ సీఐను ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు