పెన్నా లీజుల్లో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

నిబంధనలకు విరుద్ధంగా జీవోల జారీ
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే తీవ్ర ఆర్థిక నేరంలో ఆమె పాత్ర
హైకోర్టుకు నివేదించిన సీబీఐ

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సన్నిహితుడైన ప్రతాప్‌రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్‌కు లీజుల మంజూరులో పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే తీవ్రమైన ఆర్థిక నేరంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని తెలిపింది. నిబంధనలను తుంగలో తొక్కి పెన్నా సిమెంట్స్‌కు లీజులు మంజూరు చేస్తూ జీవోలు ఇచ్చారని తెలిపింది. పెన్నా సిమెంట్స్‌ కేసులో తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ సోమవారం విచారణ చేపట్టారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్‌ కపాటియా వాదనలు వినిపిస్తూ పెన్నా ప్రతాప్‌రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్‌కు అనంతరపురం జిల్లా యాడికిలో 231 ఎకరాల భూ కేటాయింపు, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కౌలపల్లిలో 304.70 హెక్టార్లలో ప్రాస్పెక్టింగ్‌ లీజు, రంగారెడ్డి జిల్లా తాండూరులో 822.13 ఎకరాల్లో లీజు రెన్యువల్‌తోపాటు హైదరాబాద్‌లో పయనీర్‌ హోటళ్ల నిర్మాణాలకు రాయితీల కల్పనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు. దీనికి సహకరించినందుకు వైఎస్సార్‌ కుమారుడైన జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో ప్రతాప్‌రెడ్డి రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కర్నూలు జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ దరఖాస్తు ఉండగా దాన్ని నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించి పెన్నాకు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకపాత్ర పోషించారన్నారు. తాండూరులో లీజుల రెన్యువల్స్‌లో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు. వాల్‌చంద్‌ తాండూర్‌ సిమెంట్‌ పేరును పెన్నా తాండూరు సిమెంట్‌గా మార్చడంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని, ఇవేవీ శ్రీలక్ష్మి పట్టించుకోలేదన్నారు. పర్యావరణ, మైనింగ్‌ ప్లాన్‌లు సమర్పించకముందే మైనింగ్‌కు అనుమతించారని చెప్పారు. 

పిటిషన్‌ విచారణార్హం కాదు

కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హం కాదని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. ‘కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను 2022లో ఉపసంహరించుకున్నారు. దీనికి కారణాలు ఆమెకే తెలియాలి. ఉపసంహరించుకున్న 9 నెలల తరువాత మళ్లీ పిటిషన్‌ వేయడం చెల్లదు. ఇది విచారణార్హం కాదు. అంతేగాకుండా సీబీఐ కోర్టులో కూడా డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడ రోజువారీ విచారణ జరుగుతోంది’ అని కోర్టుకు తెలిపారు. 

ఉనికిలో లేని సెక్షన్లు పెట్టారు

అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్‌ 13(1)(డి), 13(2) కింద ప్రభుత్వం 2022లో ప్రాసిక్యూషన్‌కు అనుమతించే సమయానికి ఆ సెక్షన్ల ఉనికే లేదని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదించారు. ఉనికిలో లేని సెక్షన్ల కింద అనుమతులు చెల్లవన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణ జరిగిందని, అంతకుముందే సీబీఐ 2016లో అభియోగపత్రం దాఖలు చేసిందని చెప్పారు. అందువల్ల నేరం జరిగిన సమయం ఆధారంగా అనుమతి మంజూరు చేసిందని, దీనికి సంబంధించి పలు సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. పిటిషనర్‌ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేయలేదన్నారు. వీటన్నింటినీ కింది కోర్టు విచారణలో తేల్చుకోవాల్సి ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాతపూర్వక వాదనలను క్లుప్తంగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు