సరస్వతిలో వాటాల బదలాయింపుపై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విచారణ డిసెంబరు 12కు వాయిదా వేసిన ఎన్‌సీఎల్‌ఏటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భారతిరెడ్డి, క్లాసిక్‌ రియాల్టీలకు చెందిన వాటాలను వై.ఎస్‌.విజయమ్మ, చాగరి జనార్దన్‌రెడ్డిల పేరుతో బదలాయింపుపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) గత నెల 14న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం మరోసారి పొడిగించింది. ఈ మేరకు డిసెంబరు 12 వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం జగన్, భారతిరెడ్డి, క్లాసిక్‌ రియాల్టీల వాటాల బదలాయింపు తరువాత విజయమ్మకు చెందిన 99.75 శాతం వాటా యథాతథంగా కొనసాగనుంది. విజయమ్మ, జనార్దన్‌రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్‌ బోర్డు తీర్మానాన్ని, దాని ప్రకారం రిజిస్టర్‌లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాలు చేస్తూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్‌ రియాల్టీలు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేయగా వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్‌ రియాల్టీల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించిన విషయం విదితమే. హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో సరస్వతి పవర్‌ లిమిటెడ్, విజయమ్మలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లు మరోసారి ఎన్‌సీఎల్‌ఏటీ ముందుకు సోమవారం విచారణకు రాగా కోర్టు సమయం ముగిసిపోవడంతో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను డిసెంబరు 12కు వాయిదా వేసింది. విజయమ్మ తరఫున న్యాయవాది మహర్షి విశ్వరాజ్‌ హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు