Andhra News: ఈ నెలలో 2 భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Nov 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

6న ‘కేఎస్‌ఎస్‌ఎల్‌’, 14న ‘ఆర్సెలార్‌ మిత్తల్‌’లకు శంకుస్థాపనలు
రూ.1,37,400 కోట్ల పెట్టుబడులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రెండు భారీ పరిశ్రమలకు ఈ నెలలో భూమిపూజ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ ఉక్కు కర్మాగారం, శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రక్షణ రంగానికి చెందిన కళ్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (కేఎస్‌ఎస్‌ఎల్‌)ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సంస్థలు రెండు దశల్లో కలిపి రూ.1,37,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఒకే నెలలో ప్రారంభించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ కార్యక్రమాలకు ఆయా శాఖల కేంద్ర మంత్రులు రానున్నారు.

మడకశిరలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో భారత్‌ ఫోర్జ్‌ అనుబంధ సంస్థ కేఎస్‌ఎస్‌ఎల్‌కు ఈ నెల 6న శంకుస్థాపన చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించారు. సైన్యానికి అవసరమైన రక్షణ పరికరాలను తయారు చేసే డిఫెన్స్‌ ఎనర్జిటిక్స్‌ యూనిట్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఆయుధాల్లో మందుగుండు సామగ్రిని నింపడం, తుపాకీ తూటాలను కేఎస్‌ఎస్‌ఎల్‌ తయారు చేస్తుంది. దీనికి 1,000 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో రూ.1,400 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామగ్రి తయారీ, పరీక్షించే యూనిట్‌నూ ఏర్పాటు చేయనుంది. ఇందుకు మరో 500 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.  

ఉక్కు పరిశ్రమతో పాటు పోర్టు కూడా..

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిత్తల్‌.. నిప్పాన్‌ స్టీల్‌ (ఏఎంఎన్‌ఎస్‌) రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ ఉక్కు కర్మాగారానికి ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈ నెల 14, 15న విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు కేంద్రం తరఫున ఆయన రానున్నారు. ఇదే సమయంలో ఉక్కు కర్మాగారానికి భూమిపూజ కూడా చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2029 నాటికి పూర్తి కానుంది. ఇక్కడ ఏటా 8.2 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ అందుబాటులోకి వస్తుంది. రెండో దశను 2033 నాటికి పూర్తి చేయాలన్నది సంస్థ లక్ష్యం. ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సొంతంగా పోర్టును సంస్థ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులకు 2,020 ఎకరాలను బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌ పురం, రాజయ్యపేట, వేంపాడు గ్రామాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు