Kasibugga Stampede: నలిగిన బతుకులు.. చెదిరిన కలలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించిన 9 మంది నేపథ్యాలివీ..

మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు 

వారంతా బడుగు జీవులు.. రెక్కల కష్టాన్నే నమ్ముకున్నారు. కార్తిక ఏకాదశి రోజున ఇష్టదైవాన్ని దర్శించాలని ఆలయానికి వెళ్లిన వారి బతుకుల్లో విషాదం అలముకుంది. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఘటనలో మృత్యువాత పడినవారి వివరాలివీ...


భర్త కళ్లెదుటే ఆగిన ఊపిరి..

టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ(48) రోజుకూలీ. భర్త చిన్నారావు భవన నిర్మాణ మేస్త్రి. భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై దర్శనానికి వెళ్లారు. ప్రమాదంలో విజయ మృతి చెందగా, చిన్నారావు గాయపడ్డారు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వీరు ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు కొన్నేళ్ల కిందట వివాహం చేశారు. 


అక్కడికక్కడే అనంతలోకాలకు..

టెక్కలి మండలం బూరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరు చిన్నమ్మి(50) భర్తతో విడిపోయి కన్నవారింట్లో ఉంటున్నారు. గ్రామంలోని బంధువులు, స్నేహితులు 30 మందితో కలిసి ఆలయానికి వెళ్లారు. తొక్కిసలాటలో చిన్నమ్మి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె వదిన నీలవేణి, గ్రామస్థులు సూరమ్మ, నాగమ్మ, గౌరి, తార పద్మావతి గాయపడ్డారు.


గ్రామస్థులు చూస్తుండగానే..

మందస మండలం బెల్లుపటియ గ్రామానికి చెందిన దువ్వ రాజేశ్వరి(60) భర్త ఐదేళ్ల కిందట చనిపోయారు. ప్రస్తుతం కుమారుడి వద్ద ఉంటున్నారు. గ్రామస్థులతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన ఆమె వారంతా చూస్తుండగానే విగతజీవిగా మారారు. 


ఆ తండ్రికి ఇక దిక్కెవరు..

గంజాం జిల్లా పాత్రపురం మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప(23) గ్రామస్థులతో పాటు దర్శనానికి వెళ్లారు. తల్లి రెండేళ్ల కిందట మృతి చెందడంతో తండ్రి, కుమార్తె ఉంటున్నారు. నర్సింగ్‌ కోర్సులో శిక్షణ పొందుతున్న ఆమె చనిపోవడంతో తనకు దిక్కెవరంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నారు. 


అందరితో వెళ్లి.. విగతజీవిగా మారి..

పలాస పట్టణంలో స్థిరపడిన డొక్కర అమ్ములమ్మ(55) తొక్కిసలాటలో మృతి చెందారు. భర్త రాజారావు ఎలక్ట్రీషియన్‌. వీరికి ముగ్గురు కుమారులు. వీధిలోని మహిళలతో కలిసి గుడికి వెళ్లిన ఆమె విగతజీవిగా మారడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.


అమ్మా.. ఏమైందమ్మా..

వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటకు చెందిన మురిపింటి నీలమ్మ(62) కుమారుడు, కోడలితో కలిసి గుడికి వెళ్లారు. ఇంతలో తొక్కిసలాట జరగడంతో క్యూలైన్‌లో కొంచెం దూరంలో ఉన్న కుమారుడు ఆమె వద్దకు వచ్చారు. అప్పటికే ఆమె ఉలుకూపలుకూ లేకుండా పడి ఉండడంతో ఏమైందమ్మా అంటూ సపర్యలు చేశారు. విగతజీవిగా మారడంతో కుప్పకూలిపోయారు. నీలమ్మ భర్త వైకుంఠరావు గతంలోనే మృతి చెందారు. 


ఆరిన ఆశల దీపం..

సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్‌(11) తల్లి అనూష, అక్క భవానీతో కలిసి దర్శనానికి వెళ్లాడు. తోపులాటలో కింద పడిపోవడంతో భక్తుల కాళ్ల కింద నలిగిపోయాడు. నిఖిల్‌ జింకిభద్ర పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తండ్రి పాపారావు రిక్షా కళాసి. తల్లి చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విగతజీవిగా మారిన ఒక్కగానొక్క బిడ్డను చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 


కూలీ ఇంట విషాదం

మందస బోయవీధికి చెందిన బోర బృందావతి(67) రోజుకూలీ. భర్త మృతి చెందడంతో కుమారుడి వద్ద ఉంటున్నారు. దైవదర్శనానికి కాశీబుగ్గ వెళ్లిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయారు. 


వెళ్లొస్తానని చెప్పి.. తిరిగిరాలేదు..

నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ(54)కు భర్తతో విడాకులు కావడంతో స్వగ్రామానికి వచ్చేశారు. సోదరుడి ఇంటి పక్కనే నివాసముంటున్నారు. శనివారం కాశీబుగ్గ వెళ్లొస్తానని వదినకు చెప్పి బయలుదేరిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారు. 


న్యూస్‌టుడే యంత్రాంగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు