కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే విస్మరించింది

కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే తమను విస్మరించిందన్న భావనతో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగీ రగిలిపోతున్నారని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏ జిల్లాలో పర్యటించినా ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల

Updated : 08 Dec 2021 05:04 IST

బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే తమను విస్మరించిందన్న భావనతో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగీ రగిలిపోతున్నారని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏ జిల్లాలో పర్యటించినా ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కొంతమంది తమను రెచ్చగొడుతున్నా సంయమనంతో ఉంటున్నామని... అంతేతప్ప చేతకాకో, చేవ చచ్చో కాదన్నారు. కర్నూలులో మంగళవారం నిర్వహించిన ఉద్యోగుల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. బొప్పరాజు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

మాపై ఎందుకు మొండి వైఖరి?

పీఆర్‌సీ నివేదిక ఎందుకు బయటపెట్టట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విడతల వారీగా డీఏలు చెల్లిస్తామన్నా సహకరించాం. అయినా సరే మాపై ఎందుకు మొండి వైఖరి ప్రదర్శిస్తోందో అర్థం కావట్లేదు. పదవీవిరమణ చేసిన ఉద్యోగులు పింఛను ప్రతిపాదనలు ఆమోదించుకునేందుకు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులను అనేకసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఉద్యమబాట పట్టాల్సి వచ్చింది.

బుగ్గన అవహేళన చేస్తున్నారు

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉద్యోగులను అవహేళన చేసి మాట్లాడుతున్నారు. రోశయ్య, యనమల రామకృష్ణుడు ఎన్నోసార్లు ఉద్యోగసంఘాల ఐకాసతో చర్చలు జరిపారు. ప్రస్తుత ఆర్థికమంత్రి ఒక్కరోజైనా మా సమస్యల పరిష్కారంపై మాట్లాడలేదు సరికదా.. మమ్మల్ని చులకన చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని