పింఛన్లపై సర్కారు మరో కుట్ర!

ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది.

Updated : 30 Apr 2024 10:18 IST

లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం!
ఇంటింటికీ పింఛన్లు సులభమైనా ససేమిరా
ముందు సచివాలయాలకు.. ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగేలా వ్యూహం
నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టేసే దురాలోచన
ఈనాడు - అమరావతి


  • అల్లూరి జిల్లాలోని 33 గిరిజన గ్రామాలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడి పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కొంతదూరం కాలినడకన వెళ్లి తర్వాత ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి. రవాణా, ఇతరత్రా ఖర్చు కలిపి ఒక్కొక్కరికీ రూ.400 అవుతుంది.
  • నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం భైరవరం సచివాలయ పరిధిలో 534 మంది పింఛనుదారులున్నారు. బ్యాంకు ఖాతాలకు అనుగుణంగా వీరు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుత్తలూరు వెళ్లి పింఛను తీసుకోవాలి. బస్‌ సౌకర్యం కూడా లేదు.

ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. అయినా రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కనపెట్టింది. ఈసారి మరింత కష్టపెట్టేలా వ్యూహాన్ని రచించింది.. అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లి, ఆ తర్వాత సుదూరంలో ఉండే ఆ బ్యాంకుకు వెళ్లి జనం ఇక్కట్ల పాలయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇదీ పింఛనుదారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కశ వైఖరి. రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్య 15,004. వాటిలో 1.35 లక్షలమంది సిబ్బంది ఉన్నారు. వారి ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయడం ఎంతో సులభం. కానీ సీఎస్‌గానీ, వైకాపా ప్రభుత్వంగానీ అలా చేయదలుచుకోలేదు. ఇది కానిపక్షంలో కనీసం పింఛనుదారుల నివాస ప్రాంతానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయానికి వెళ్లి పింఛను నగదు తీసుకోవడం సులభం. ప్రభుత్వం మాత్రం 5-40 కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాంకుకు వెళ్లి తీసుకోమని చెబుతోంది.

ముందు సచివాలయానికి.. ఆపై బ్యాంకుకు

అది కూడా మొదటగా సచివాలయానికి వెళ్లి ఏ బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉందో తెలుసుకుని తర్వాత సుదూరంలో ఉండే ఆ బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షలమంది ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చని విపక్షాలు నెత్తీనోరు బాదుకున్నా.. ధర్నాలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా సర్కారు చెవికెక్కలేదు. బ్యాంకుల్లో నగదు జమ చేస్తామంటూ మరింత క్లిష్టమైన పరిస్థితి తెచ్చి పెట్టింది. చాలా గ్రామాలకు బ్యాంకులు అందుబాటులో లేవు. సరిపడా సిబ్బంది ఉండని పరిస్థితి. పైగా రోజువారీ వారికి ఉండే పనులు చూసుకుని పింఛన్లు పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజులు పైనే పడుతుంది. ఇలా జాప్యానికి కారణం విపక్షాలే అని చూపించడానికి (ఏప్రిల్‌ 1న జరిగినట్లు) మరోసారి ఆస్కారం ఇవ్వడమే ఈ కుట్ర వెనుక దాగివున్న అసలు ఉద్దేశంలాగా కనిపిస్తోంది.

బ్యాంకు పనులు మానేసి పింఛను సొమ్ము ఇస్తారా?

  • సాధారణంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు పింఛను డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. మే 1న బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ రోజు మేడే సెలవు. అంటే తొలిరోజు పింఛను అందనట్టే. సెలవు తర్వాత వచ్చే రోజు సాధారణంగా బ్యాంకుల్లో రద్దీ ఉంటుంది. పింఛనుదారులు కూడా ఆ రోజే ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీంతో తిప్పలు తప్పనట్లే!  
  • బ్యాంకుల్లో సాధారణంగా రోజువారీ పనులు ఎన్నో ఉంటాయి. సర్వర్‌ సమస్యలూ తప్పవు.
  • నగదు జమ, విత్‌డ్రాకు సంబంధించిన వ్యవహారాలు చూసేది ఒక్కరే. కొన్ని పెద్ద బ్రాంచీల్లోనే ఇద్దరు ఉంటారు.
  • పైగా పింఛను సొమ్ములు ఇవ్వడానికి వారు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఇతర రెగ్యులర్‌ కస్టమర్ల బిజినెస్‌ వ్యవహారాలు చూసుకుంటూ పింఛనుదారులకూ సొమ్ము పంపిణీ చేయాలి. బ్యాంకు సిబ్బందికీ తలకు మించిన భారమే. 5 నుంచి 30 కిలోమీటర్ల దూరం వ్యయ ప్రయాసలకోర్చి బ్యాంకులకు చేరుకుని అక్కడ పడిగాపులు కాయడం పింఛనుదారులకూ ఇబ్బందికరమే.

పోలింగ్‌ తేదీ వరకు ఇబ్బంది పెట్టే ఎత్తుగడే..

  • రాష్ట్రవ్యాప్తంగా 8,060 బ్యాంకు బ్రాంచీలున్నాయి. వీటిలో గ్రామీణంలో 2,734, సెమీ అర్బన్‌, 2,492, అర్బన్‌లో 2,051, మెట్రోలో 783 ఉన్నాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా 65.49 లక్షల మంది పింఛనుదారులుంటే వారిలో పట్టణాలు, నగరాల్లో ఉండేది 12.17 లక్షల మందే. ఇక 52.89 లక్షల మంది ఉండేది గ్రామీణ ప్రాంతాల్లోనే.
  • సగటున ఒక్కో బ్యాంకు బ్రాంచ్‌కి పట్టణ ప్రాంతాల్లో 429 మంది పింఛనుదారులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,012 మంది పింఛనుదారులు వస్తారు.
  • ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే 16.57 లక్షల మందికి మినహాయించినా ఒక్కో బ్యాంకు వద్దకు వెళ్లాల్సిన వారి సంఖ్య సగటున పట్టణాలు, గ్రామాల్లో 350 నుంచి 900 వరకు ఉంటుందని అంచనా.
  • ఇతర లావాదేవీలు చూసుకుంటూ సగటున రోజుకు 50 నుంచి 70 మందికి మించి పంపిణీ జరిగే అవకాశం లేదు. అది సర్వర్‌ సమస్యలు లేకుండా ఉంటేనే. ఈ లెక్కన పంపిణీకి వారం రోజులకుపైగా పట్టే అవకాశముంది.
  • అంటే  పింఛనుదారుల్ని ఎలాగైనా మండుటెండల్లో ఇబ్బంది పెట్టి పోలింగ్‌ తేదీ వరకు పంపిణీ కొనసాగించే ఉద్దేశమే ఇది

5 నుంచి 30 కి.మీ. వెళ్లాల్సిందే...

  •  నెల్లూరు జిల్లాలో కందుకూరు మండలం పాలూరు దొండపాడు పంచాయితీకి చెందిన 392 మంది పింఛనుదారులు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే కందుకూరుకు వెళ్లాలి. ఈ గ్రామానికి బస్‌ సౌకర్యం కూడా లేదు.
  • చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం ఇరిసిగానిపల్లె గ్రామానికి చెందిన పింఛనుదారులు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే కుప్పం పట్టణానికి వెళ్లాలి.
  • కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు శివారు వీరవల్లి మోకాస గ్రామానికి చెందిన పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లి పింఛను తీసుకోవాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణించాలి.
  • తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన పింఛనుదారులు 5 కిలోమీటర్ల దూరంలోని ధర్మవరం గ్రామానికి వెళ్లి పింఛను తీసుకోవాలి.
  • వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు మండలంలోని మంగపట్నం గ్రామానికి చెందిన పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణించాలి.
  •  రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వెళ్లినరోజే పింఛను సొమ్ము ఇవ్వకపోతే మర్నాడు మళ్లీ వెళ్లాలి. ఇది ఎంత ఇబ్బందికరం! ఇంటింటికీ ఇవ్వాలనేది పింఛనుదారుల ప్రధాన డిమాండ్‌. అలా పంపిణీ చేసేందుకు అంతగా ఇబ్బందులుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇవ్వొచ్చు కదా? ఇలా ఊరు దాటి ఊర్లో ఉండే బ్యాంకులకు తిప్పడం ఏంటి? కనీసం ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండు రోజుల్లోనే 90 శాతం పంపిణీ చేశారు కదా? పోలింగ్‌కు 13 రోజుల సమయం ఉండగా పింఛనుదారుల్ని బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా చేయడం కుట్ర కాక మరేంటి?

గిరిజనులున్నారనే విషయం గుర్తుందా?

కొండలు, గుట్టల నడుమ కనీసం రహదారి లేని గిరిజన గ్రామాలు రాష్ట్రంలో కోకొల్లలు. వాటికి సుదూరంలో బ్యాంకులు ఉంటాయి. చాలా గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. వారందరూ కాలినడకను ఆశ్రయించాల్సిందే. బ్యాంకుల్లో నగదు జమ అంటే ఇలాంటి అభాగ్యులందరినీ ఇబ్బందులకు గురిచేయడమే కదా?

  • పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మూడు బ్యాంకులు ఉన్నాయి. రెండు కొమరాడలో, ఒకటి కూనేరులో ఉంది. ఈ మండలంలో 8,619 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో ఆరు వేల మందికి పైగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తే 31 పంచాయతీలు 99 రెవెన్యూ గ్రామాల నుంచి వారంతా మూడు బ్యాంకులకు రావాలి. శివారున ఉన్న కుంతేశు గ్రామం నుంచి బ్యాంకుకు రావాలంటే వారు 35 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి.
  • విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామానికి చెందిన పింఛనుదారులు పదిహేను కిలోమీటర్ల దూరంలోని మెంటాడకు వెళ్లి పింఛను తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని