Supreme Court: ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు

ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 17 May 2024 06:07 IST

అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు ఉండాలి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
వారంతా సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా వ్యవహరించాలి
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ధిక్కార చర్యలు తప్పవు
4 రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇసుక తవ్వకాలు ఆపించాలి: సుప్రీంకోర్టు
అక్రమాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం
అవన్నీ మాటలకే పరిమితమని ప్రతివాది ఆవేదన
ఈనాడు - దిల్లీ

ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని వెంటనే నిలిపివేయించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌ నేతృత్వంలో పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసి అక్రమ తవ్వకాలను ఆపించాలని ఆదేశించింది. ఈ కమిటీలోని అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా వ్యవహరించి ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతూ దండా నాగేంద్రకుమార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకునేవరకూ యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలిపేయాలని ఆదేశిస్తూ 2023 మార్చి 23న తీర్పు వెలువరించింది. దాన్ని సవాలు చేస్తూ జైప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థ దాఖలుచేసిన కేసుపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నెల 10న ఇదే అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అందులో భాగంగా గురువారం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హుజెఫా అహ్మది తొలుత వాదనలు ప్రారంభిస్తూ గత వాయిదా సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు తాము అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రతివాది చెప్పిన అన్ని ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఒకచోట ఇసుక తవ్వుతున్న యంత్రాలను పోలీసులు జప్తు చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించినప్పుడు కొన్నిచోట్ల అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కనిపించిందని, అయితే తనిఖీ చేసిన రోజు మాత్రం తవ్వకాలు లేవని చెప్పారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 9 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు ఆగిపోయాయని, తదుపరి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 165 ఇసుక రీచ్‌లు ఉన్నాయని, అక్కడ అక్రమ తవ్వకాలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 30,760 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి, 35,484 వాహనాలను జప్తుచేసి, రూ.8.54 కోట్ల జరిమానా విధించినట్లు వెల్లడించారు.

మాటలకే పరిమితం: లూథ్రా

ప్రతివాది నాగేంద్రకుమార్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన చర్యలన్నీ మాటలకే పరిమితం అని చెప్పారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎవరిపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకోలేదు. రీచ్‌లలో సాయుధ బలగాలను పెట్టి అటువైపు వెళ్లేవారిపై దాడులు చేయిస్తున్నారు. త్వరలో వర్షాలు వస్తాయి కాబట్టి ఇప్పటివరకూ తవ్విన ఆనవాళ్లు కొట్టుకుపోతాయన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. మా క్లయింట్‌ క్షేత్రస్థాయిలో తనిఖీకి వెళ్తే దాడిచేసేందుకు ప్రయత్నించారు’’ అని తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ తరఫున హాజరైన న్యాయవాది జోక్యం చేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ అధికారులు ఈ నెల 14, 15 తేదీల్లో పర్యటించినప్పుడు ఇది కనిపించిందన్నారు. అప్పుడు రాష్ట్రప్రభుత్వ న్యాయవాది హుజెఫా అహ్మది జోక్యం చేసుకుంటూ ఆ వివరాలు తమకు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. ఆ వాదనలను లూథ్రా తోసిపుచ్చారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ చెబుతున్నప్పుడు తన పరిధిలో ఏం జరుగుతోందో రాష్ట్రప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు.

ఇక్కడ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతోందన్నారు. అప్పుడు జస్టిస్‌ ఓక జోక్యం చేసుకుంటూ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులకు ప్రత్యేక యంత్రాంగం ఉందా అని రాష్ట్రప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పగా న్యాయమూర్తి అంగీకరించలేదు. ఏదైనా టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించగా... 48 గంటల్లోపు ఆ పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఈరోజు ఉదయం కూడా తవ్వకాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రతివాదులు చూపుతున్నారని, ఆ ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవమేనని, అధికారులు ఉదయమే అక్కడికెళ్లి బాధ్యులను అరెస్టు చేసి, వాహనాలను జప్తు చేసినట్లు చెప్పారు. ఎన్ని ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి జస్టిస్‌ ఓక అడిగిన ప్రశ్నకు న్యాయవాది లూథ్రా బదులిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 100కిపైగా రీచ్‌లలో జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 30వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు చెప్పినా చివరకు వాటి పరిస్థితి ఏమైందో మాత్రం చెప్పలేదన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ న్యాయవాది బదులిస్తూ అన్నిచోట్లా తవ్వకాలు జరిపినట్లు తమ తనిఖీల్లో తేలిందన్నారు. అన్నిపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక ఉత్తర్వులు జారీచేశారు.


ఇదీ కోర్టు ఉత్తర్వు

‘‘ఆంధ్రప్రదేశ్‌లో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిషేధిస్తూ ఎన్జీటీ తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నట్లు ప్రతివాది కోర్టు దృష్టికి తెచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేస్తున్నవారిపై దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ప్రతివాది పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ చర్యలు మాటలకే పరిమితమయ్యాయని సీనియర్‌ న్యాయవాదులు పేర్కొన్నారు. ఎన్జీటీ నిషేధించిన ప్రాంతాల్లో అక్రమ తవ్వకాల నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటుందని వారి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది చెప్పారు. ఈ నేపథ్యంలో మేం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. దాని ప్రకారం...

  • రాష్ట్రప్రభుత్వం ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు ఆపే బాధ్యతలను ఆ కమిటీకి అప్పగించాలి.
  • కమిటీ క్రమం తప్పకుండా పర్యటించి అక్రమ తవ్వకాలు జరగకుండా చూడాలి.
  • ఎన్జీటీ తీర్పు అమలులో ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగాయో చెబుతూ ఈ కమిటీలకు ప్రతివాది నాగేంద్రకుమార్‌ ఫిర్యాదుచేయొచ్చు.
  • కమిటీలో సభ్యులైన కలెక్టర్లు, ఇతర అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా విధులు నిర్వర్తించాలి. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలుచేసే బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని అధికారులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
  • ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. ఒక టోల్‌ఫ్రీ నంబరు, ప్రత్యేక ఈమెయిల్‌ ఐడీ ఉండాలి.
  • వీటికి వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపి, చర్యలు తీసుకొనేలా ఆదేశించాలి.
  • టోల్‌ఫ్రీ నంబరు, ఈమెయిల్‌ ఐడీలను   మూడు రోజుల్లోపు ప్రతివాది నాగేంద్రకుమార్‌కు అందించాలి.
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగేచోట ఆకస్మిక తనిఖీలు చేయాలి.
  • సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులను తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటివారు కోర్టు ధిక్కరణతో పాటు, ఇతరత్రా చర్యలకు బాధ్యులవుతారు.
  • ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జులై 8లోగా అఫిడవిట్లు దాఖలుచేయాలి. వాటిని జులై 15న మేం పరిశీలిస్తాం.
  • ఈ ఉత్తర్వులను అమలుచేయకపోతే కేసు దాఖలు చేయడానికి ప్రతివాదికి అనుమతిస్తున్నాం.
  • కమిటీలు నాలుగు రోజుల్లోపు తనిఖీలు చేపట్టాలి.
  • రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి సురేష్‌బాబు ఇచ్చిన నివేదికలో ఉన్న ప్రాంతాన్ని కలెక్టర్‌ వెంటనే సందర్శించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని