Bajaj Finance: ఎఫ్‌డీ రేట్లు పెంచిన బజాజ్‌ ఫైనాన్స్‌.. వారికి 8.85% వరకు వడ్డీ

బజాజ్‌ ఫైనాన్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం, సాధారణ పౌరులకు 8.6 శాతం వడ్డీ అందిస్తోంది.

Published : 08 Apr 2024 19:11 IST

Bajaj Finance FD rates | దిల్లీ: ప్రముఖ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌కు చెందిన బజాజ్‌ ఫైనాన్స్ (Bajaj Finance) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించింది. వివిధ కాల వ్యవధులు కలిగిన డిపాజిట్లపై 60 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఏప్రిల్ 3 నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

సీనియర్‌ సిటిజన్లకు 25-35 నెలల కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 60 బేసిస్‌ పాయింట్లు, 18-24 నెలల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 40 బేసిస్‌ పాయింట్లు చొప్పున పెంచినట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. సాధారణ పౌరులకు 25-35 నెలల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 45 బేసిస్‌ పాయింట్లు; 18-22 నెలల కాలవ్యవధులపై 40 బేసిస్‌ పాయింట్లు; 30-33 నెలల కాలవ్యవధులు కలిగిన డిపాజిట్లు 30 బేసిస్‌ పాయింట్లు చొప్పున పెంచినట్లు పేర్కొంది.

‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?

42 నెలల కాల వ్యవధికి డిజిటల్‌గా ఎఫ్‌డీ బుక్‌ చేసిన సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం వడ్డీ అందుతుంది. అదే సాధారణ పౌరులకైతే గరిష్ఠంగా 8.6 శాతం అందిస్తామని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మార్చి 31 నాటికి రూ.60 వేల కోట్లు డిపాజిట్లు సేకరించామని, ఇలా సేకరించిన అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ తమదేనని బజాజ్‌ ఫైనాన్స్‌ పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద నమోదైన ఎన్‌బీఎఫ్‌సీల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా ఒకటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని