HDFC Bank Pixel Play: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి పిక్సెల్‌ పే క్రెడిట్‌ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..

HDFC Bank Pixel Play: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్తగా పిక్సెల్‌ ప్లే పేరిట కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. దీంట్లో మీకు నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకుని రివార్డు ప్రయోజనాలు అందుకోవచ్చు.

Updated : 20 May 2024 17:59 IST

HDFC Bank Pixel Play | ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్లో చాలా రకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటి వినియోగం పెరిగిన నేపథ్యంలో కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులతో (అమెజాన్‌-ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్) పాటు కేటగిరీల వారీగా (ట్రావెల్‌, షాపింగ్‌, డైనింగ్‌, ఫ్యూయల్‌) రివార్డులు అందించే కార్డులు పుట్టుకొచ్చాయి. అయితే, ఒక కేటగిరీకి చెందిన కార్డు తీసుకుంటే.. మిగిలిన వాటిపై రివార్డు పాయింట్ల రూపంలో వచ్చే ప్రయోజనాలు కోల్పోయినట్లే. ఆ కేటగిరీ ప్రయోజనాలూ అందుకోవాలంటే మరో క్రెడిట్‌ కార్డు తీసుకోవాల్సిందే. ఇలాంటి వారి కోసమే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పిక్సెల్‌ ప్లే (HDFC Bank Pixel Play) క్రెడిట్‌ కార్డును ఇటీవల తీసుకొచ్చింది. ఇందులో రివార్డు ప్రోగ్రామ్‌ను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. ఆయా కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డును ఎలా కస్టమైజ్‌ చేసుకోవాలి? జాయినింగ్‌ ఫీజు ఎంత?

మనలో చాలా మంది పండగలు రాగానే దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. మిగిలిన సీజన్స్‌లో డైనింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొందరైతే ఏడాది పొడవునా ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అలాగని ప్రతి సీజన్‌కు తగ్గట్టు ఆ కేటగిరీకి చెందిన క్రెడిట్‌ కార్డును తీసుకోవడం సాధ్యపడదు. దీనికి హెచ్‌డీఎఫ్‌సీ పిక్సెల్‌ ప్లే పరిష్కారం చూపుతుంది. ఐదు రకాల కేటగిరీల్లో ఏదేని రెండింటిని యూజర్లు ఎంచుకోవచ్చు. వాటిపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆయా కేటగిరీలను మార్చుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన పేజ్‌యాప్‌లో (payZapp) మార్పులు చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. ఆ లింకులపై క్లిక్‌ చేయొద్దు..!

కేటగిరీల వారీగా..

  • డైనింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌- బుక్‌ మై షో, జొమాటో
  • ట్రావెల్‌- మేక్‌మై ట్రిప్‌, ఉబర్‌
  • గ్రాసరీ- బ్లింకిట్‌, రిలయన్స్‌ స్మార్ట్‌ బజార్‌
  • ఎలక్ట్రానిక్స్‌- క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌
  • ఫ్యాషన్- నైకా, మింత్రా
  • వీటిలో ఏ రెండు కేటగిరీలను ఎంచుకున్నా.. ఆ కేటగిరీలోని ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ వేదికలపై కొనుగోళ్లపై 5 శాతం లభిస్తుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుంటే 3 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేజ్‌యాప్‌లో (payZapp) దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్‌ ప్లే యాప్‌స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పిక్సల్‌ ప్లే క్రెడిట్‌ కార్డు బ్యానర్‌పై క్లిక్‌ చేయాలి. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియ ఉంటుంది. నెలకు రూ.25వేలు కంటే ఎక్కువ ఆర్జిస్తున్న ఉద్యోగులకు, రూ.6 లక్షల వార్షిక వేతనం కలిగిన స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ కార్డును జారీ చేస్తారు. పేజ్‌యాప్‌లో వర్చువల్‌గా పేమెంట్లు చేయడంతో పాటు, ఆఫ్‌లైన్‌లో ఫిజికల్‌ కార్డును వినియోగించుకోవచ్చు.

జాయినింగ్‌ ఫీజు, రివార్డులు

ఈ కార్డు పొందాలంటే జాయినింగ్‌ ఫీజు రూ.500 చెల్లించాలి. కార్డు తీసుకున్న 90 రోజుల్లో రూ.20 వేలు ఖర్చు చేస్తే ఫీజు రద్దవుతుంది. ఒక ఏడాదిలో రూ.1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రెన్యువల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రివార్డుల రూపంలో వచ్చిన క్యాష్‌ పాయింట్లు పేజ్‌యాప్‌ వాలెట్‌లో జమ అవుతుంది. యాప్‌లోనే రిడీమ్‌ చేసుకోవచ్చు.

చివరిగా: వివిధ కేటగిరీల వారీగా రివార్డు ప్రయోజనాలు అందుకోవాలనుకునే వారికి ఈ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగా ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయం ఇందులో లేదు. పైగా కేటగిరీల్లో ఎంపిక చేసిన వేదికలపై మాత్రమే రివార్డు ప్రయోజనాలు లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని