ఫిక్స్‌డ్‌ వడ్డీరేట్లకు మారే అవకాశమివ్వండి.. బ్యాంకులకు RBI సూచన

RBI to banks: ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల నుంచి ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లకు మారే అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఓ నోటిఫికేషన్‌ వెలువరించింది. 

Updated : 18 Aug 2023 19:20 IST

ముంబయి: రుణాలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వడ్డీ రేట్లను రీసెట్‌ చేసేటప్పుడు ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లకు (fixed interest rates) మారే అవకాశాన్ని రుణ గ్రహీతలకు కల్పించాలని సూచించింది. అలాగే ఈఎంఐ, కాలావధి, రెండూ పెంచుకునే అవకాశం సైతం రుణ గ్రహీతకు ఉండాలని పేర్కొంది. ఇటీవల పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఈ అంశాన్ని తొలుత ప్రస్తావించిన ఆర్‌బీఐ.. ఆ మేరకు తాజాగా బ్యాంకులకు ఆదేశాలు ఇస్తూ ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వడ్డీ రేట్లు మారినప్పుడు వినియోగదారుల సమ్మతి లేకుండానే బ్యాంకులు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మొత్తంలో మార్పు చేయకుండా.. కాలవ్యవధిని సవరిస్తూ పోతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ‘‘బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు మారినప్పుడు ఈఎంఐ/ కాలవ్యవధి, రెండింటిపై పడే ప్రభావం గురించి బ్యాంకులకు రుణం మంజూరు చేసేటప్పుడే బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు స్పష్టంగా పేర్కొనాలి. ఈఎంఐ/ కాల వ్యవధి లేదా రెండింటినీ పెంచాల్సిన సందర్భంలోనూ రుణ గ్రహీతలకు ఆ వివరాలను తెలియజేయాలి’’ అని ఆర్‌బీఐ పేర్కొంది. 

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..

అలాగే రుణాలు రీసెట్ చేసే సమయంలో సంబంధిత బోర్డు ఆమోదం పొందిన పాలసీ ప్రకారం.. రుణ గ్రహీతలు ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లకు మారే అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ పేర్కొంది. రుణ కాలవ్యవధిలో ఎన్నిసార్లు వడ్డీ రేట్లకు మారేందుకు అవకాశం ఉంటుందో కూడా రుణ గ్రహీతలకు స్పష్టంగా పేర్కొనాలని బ్యాంకులకు సూచించింది. అలాగే రుణ ఈఎంఐ, కాల వ్యవధి, లేదా రెండింటినీ పెంచుకునే ఆప్షన్‌ రుణ గ్రహీతకు ఉండాలని సూచించింది. రుణ కాలవ్యవధిలో రుణ మొత్తాన్ని లేదా కొంతమొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పంచాలని సూచించింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం హోమ్‌లోన్‌ కస్టమర్లతో పాటు ఫ్లోటింగ్‌ రేటు కలిగిన వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు తీసుకున్న వారికీ వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని