Jio Q4 results: రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత.. ఆదాయం 11 శాతం జంప్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం స్వల్పంగా క్షీణించగా.. ఆదాయం మాత్రం 11 శాతం పెరిగింది.

Updated : 22 Apr 2024 20:06 IST

Reliance Q4 results | దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా క్షీణించి రూ.18,951 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.19,299 కోట్లతో పోలిస్తే ఇది రెండు శాతం తక్కువ. కంపెనీలో ప్రధాన వ్యాపార విభాగమైన ఆయిల్‌, పెట్రో కెమికల్‌ వ్యాపారం కోలుకోవడం.. టెలికాం, బిజినెస్‌ వ్యాపార విభాగాలు రాణించడంతో దాదాపు లాభం దాదాపు ఫ్లాట్‌గా నమోదైంది.

సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 11 శాతం మేర పెరిగింది. ఆయిల్‌ ధరలు పెరగడం ఇందుకు దోహదం చేసింది. మొత్తం రూ.2.64 లక్షల కోట్లు ఆదాయంగా వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.69,621 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.66,702 కోట్లుగా ఉంది. 

జియో అదుర్స్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్‌ జియో మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో రూ.5,337 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,716 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ.25,959 కోట్లు ఆదాయం వచ్చినట్లు జియో తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.20,466 కోట్ల నికర లాభం వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.1,00,119 కోట్లుగా నమోదైంది. జియో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్‌ మష్రువాలా (76) జూన్‌ 9న ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. పంకజ్ మోహన్‌ పవార్‌ ఎండీగా కొనసాగనున్నారని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని