సొంత పాలసీ తీసుకోవాలా?

ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

Updated : 05 Apr 2024 01:07 IST

ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? నా పేరుమీద రూ.50లక్షల టర్మ్‌ పాలసీ ఉంది. దీన్ని ఇంకా పెంచుకోవాలా?

శశికాంత్‌

మీరు తీసుకున్న బీమా.. మీ పాప భవిష్యత్‌ అవసరాలు, కుటుంబ బాధ్యతలకు సరిపోతుందా ఒకసారి చూసుకోండి. తక్కువగా ఉంటే పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.12వేలలో రూ.8వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. మిగతా రూ.4వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి.


ఏడాది క్రితం ఉద్యోగంలో చేరాను. యాజమాన్యం అందిస్తున్న బృంద ఆరోగ్య బీమా ఉంది. ఇందులోనే కొనసాగడం మంచిదేనా? నెలకు రూ.8 వేల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఏం చేయాలి?

సుధీర్‌

 యాజమాన్యం అందించే బృంద బీమా ఉన్నా.. సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిది. ఉద్యోగం మానేసినప్పుడు బృంద బీమా రక్షణ దూరమవుతుంది. ఆరోగ్య బీమాతోపాటు వ్యక్తిగత ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలనూ తీసుకోండి. ఆరు నెలల అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడులు ప్రారôభించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.8వేలలో రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. రూ.3వేలను పీపీఎఫ్‌లో పొదుపు చేయండి.


మా నాన్న వయసు 65. తన పేరుపై ఒకేసారి రూ.6లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, నెలనెలా వడ్డీ వచ్చే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికోసం మంచి పథకాలు సూచించండి.

ప్రభు

ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైన వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్లకు ఇంకాస్త వడ్డీ రేటు అధికంగా ఉంది. ఏదైనా పెద్ద బ్యాంకులో నాన్‌ క్యుములేటివ్‌ వడ్డీకి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయొచ్చు. ప్రత్యామ్నాయంగా సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంనూ పరిశీలించవచ్చు. ఇందులో 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీ వస్తుంది.                  
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని