అప్పు చేసి.. పెట్టుబడి వద్దు

రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్‌ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది.

Updated : 26 Apr 2024 00:42 IST

రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్‌ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. వడ్డీ 9.15 శాతం. ఈ రుణాన్ని తీసుకొని, షేర్లలో మదుపు చేస్తే మంచి రాబడి వస్తుందా?

- గౌతమ్‌ 

  •  ఈక్విటీ ఆధారిత పెట్టుబడులకు కనీసం అయిదేళ్ల వ్యవధి ఇవ్వాలి. స్వల్పకాలంలో వీటిలో నష్టభయం ఉంటుంది. నేరుగా షేర్లలో మదుపు చేసినప్పుడు మార్కెట్‌పై మంచి అవగాహన ఉండాలి. షేర్ల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మంచి రాబడి సాధ్యం అవుతుంది. ముఖ్యంగా.. ఈక్విటీ పెట్టుబడుల కోసం సొంత డబ్బునే ఉపయోగించాలి. అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం సరికాదు. మీరు రుణం తీసుకున్నప్పుడు నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) చెల్లించాల్సి ఉంటుంది కదా. ఈ మొత్తాన్నే డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం ఉత్తమం.

మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్‌లో చేరాడు. ఆరేళ్ల తర్వాత విదేశాలకు పంపించాలనేది ఆలోచన. ఇప్పుడు నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- విజయ్‌

  • ముందుగా మీ అబ్బాయి, మీ కుటుంబం భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ ఏర్పాటు చేయండి. ఇందుకోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చేలా చూసుకోండి. క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. కనీసం 12 శాతం వార్షిక రాబడితో నెలకు రూ.20వేల పెట్టుబడి పెడితే పదేళ్ల తర్వాత రూ.19,47,645 అయ్యేందుకు వీలుంది. ఈ మొత్తం మీ అబ్బాయి చదువు అవసరాలకు సరిపోకపోవచ్చు. కాబట్టి, మీ పెట్టుబడిని పెంచుకునే ప్రయత్నం చేయండి.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు రెండేళ్ల నుంచీ మధుమేహం ఉంది. నా వయసు 53. ఇప్పుడు పాలసీ ఇస్తారా?

- నారాయణ

  • ప్రస్తుతం మధుమేహం ఉన్న వారికీ ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పరిశీలించవచ్చు. మీరు పాలసీకి దరఖాస్తు చేసినప్పుడు ఆరోగ్య వివరాలను పూర్తిగా తెలియజేయండి. అవసరమైతే బీమా సంస్థ ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంది. వీటి ఆధారంగానే పాలసీని ఇస్తారు.

ప్రస్తుతం నెలకు రూ.7వేల వరకూ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. రెండేళ్ల నుంచీ రాబడి 14 శాతం వరకూ కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా రూ.10వేలు ఇందులోనే మదుపు చేయాలా? లేక సురక్షిత పథకాలను ఎంచుకోవాలా? మరో 10 ఏళ్లు పెట్టుబడి కొనసాగిస్తే ఎంత మొత్తం జమ అవుతుంది.

- కృష్ణమోహన్‌

  • మూడేళ్లుగా భారత ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగుంది. కొన్ని పథకాలు 30 శాతం వరకూ రాబడిని అందించాయి. సాధారణంగా దీర్ఘకాలంలో ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల నుంచి 12 నుంచి 14 శాతం వరకూ సగటు వార్షిక రాబడిని ఆశించవచ్చు. మీకు పదేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, కొత్తగా మదుపు చేసే మొత్తాన్నీ మంచి పనితీరుగల ఫండ్లలో మదుపు చేయండి. నెలకు రూ.17వేల చొప్పున మదుపు చేస్తూ వెళ్తే.. 12 శాతం వార్షిక రాబడి అంచనాతో పదేళ్ల తర్వాత రూ.35,79,941 అయ్యేందుకు వీలుంది.

 తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని