e-pan: ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ కావాలా..? ఉచితంగా పొందండిలా..

e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు రోజులత‌ర‌బ‌డి ఎదురుచూడాల్సిన ప‌ని లేకుండా త‌క్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..?

Published : 23 Apr 2024 11:50 IST

Instant e-pan | ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాంకుల్లో పెద్ద మొత్తం డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా, ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలన్నా, ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా.. ఇలా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు సజావుగా నిర్వహించాలన్నా పాన్‌కార్డ్‌ (Pan Card) ఉండాల్సిందే. ఇప్పటివరకు పాన్‌కార్డు లేనివారు.. కొత్తగా పాన్‌ పొందాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ అత్యవసర సమయంలో తక్షణమే పాన్‌ నంబర్‌ కావాలంటే..?    దానికి పరిష్కారమే ఇ-పాన్‌. ఆదాయపు పన్ను విభాగం ఈ సదుపాయాన్ని అందిస్తోంది. అతి తక్కువ సమయంలో ఇ-పాన్‌ నంబర్‌ జనరేట్‌ చేయొచ్చు. అదెలాగంటే..?

ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

  • ముందుగా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లాలి.
  • స్క్రీన్‌పై ఎడమవైపు కనిపిస్తున్న Quick Links సెక్షన్‌లో Instant E-PAN అని ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • వెంటనే Get New e-PAN అని ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఆధార్‌ కార్డ్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి కింద కనిపించే I confirm That చెక్‌బాక్స్‌పై టిక్‌ చేసి Continue పై క్లిక్‌ చేయండి.
  • మీ ఆధార్‌ కార్డ్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయగానే వ్యక్తిగత వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. 
  • ఆ వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో ఓసారి పరిశీలించి I Accept that చెక్‌ బాక్స్‌ను ఎంచుకొని Continue పై క్లిక్‌ చేయాలి.
  • అంతే మీ ఇన్‌స్టంట్‌ పాన్‌ కోసం దరఖాస్తు పూర్తయినట్లే. మీకో ఎక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ కూడా జనరేట్‌ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా నోట్‌ చేసుకోండి.
  • ఆధార్‌ లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కూడా అందుతుంది. ఆ ఎస్సెమ్మెస్‌ అందగానే Get New e- PAN (పైన చెప్పిన విధంగానే) పక్కనే ఉన్న Check status / Download PAN ఆప్షన్‌ ఎంచుకోండి.
  • ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయగానే మీ పాన్‌ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అక్కడే View e-pan, Download e-pan ఆప్షన్లు ఉంటాయి. వాటి సాయంతో ఇ-పాన్‌ను డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.

తక్షణ పాన్‌కార్డ్‌ కావాలనుకొనే వారికి ఈ సేవలు ఉపయోగపడతాయి. ఈ-పాన్ అనేది ఐటీ శాఖ వారు ఎల‌క్ట్రానిక్ ఫార్మట్‌లో జారీ చేస్తారు. దీనిపై డిజిట‌ల్ సంత‌కం ఉంటుంది. ఇది ఉచిత స‌ర్వీస్‌. ఈ-పాన్ కేటాయించినందుకు ఎటువంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇ-పాన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ నంబర్‌కు మీ మొబైల్ నంబర్‌ అనుసంధానించి ఉండాలి. ఇప్పటికే పాన్‌కార్డ్‌ ఉన్న వాళ్లు ఇ-పాన్‌ కోసం దరఖాస్తు చేసుకోకూడదు. ఒకటికి మించి పాన్‌ కార్డు ఉంటే రూ.10వేలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ ఏదైనా కారణంతో ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ అభ్యర్థనను తిరస్కరించినా లేదా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోగా ఎటువంటి అప్‌డేట్‌ రాకున్నా NSSDL/UTITSL ద్వారా పాన్‌ కోసం రిక్వెస్ట్‌ పంపాలి. ఒకవేళ ఫిజికల్‌ పాన్‌ కార్డు కావాలంటే NSDL వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని