డిప్యూటీ మేయర్‌ కారు షెడ్‌లో మద్యం

ఎన్నికల నామినేషన్‌ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది.

Updated : 19 Apr 2024 04:28 IST

170 కేసులను స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: ఎన్నికల నామినేషన్‌ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రాజేష్‌రెడ్డికి చెందిన కారు షెడ్డుపై వన్‌టౌన్‌ పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులతో కలిసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ గురువారం దాడి చేసింది. ఆ సమయంలో షెడ్డులో ఉన్న వ్యక్తిని విచారించగా తాను స్వీపర్‌నని, ఈ షెడ్డు డిప్యూటీ మేయర్‌ రాజేష్‌రెడ్డిదని చెప్పడంతో అధికారులు దానిని వీడియో తీసుకున్నారు. 170 కేసుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.10.28 లక్షలు ఉంటుందని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వెల్లడించారు. సరకును చిత్తూరు అర్బన్‌ ఎస్‌ఈబీ అధికారులకు అప్పగించామని, రాజేష్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

వైకాపా నాయకుడి స్థలంలో 6,240 సీసాల గోవా మద్యం

ఆలమూరు, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైకాపా నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్‌ఈబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెనికేరు రహదారిపై ఉన్న ఈ బట్టీలో మద్యం సీసాలున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఎస్‌ఈబీ అధికారులు దాడి చేశారు. స్థానిక వైకాపా నాయకుడు, ప్రస్తుతం మండపేట వైకాపా ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న సీహెచ్‌ ప్రభాకరరావు ఈ బట్టీ యజమాని. మొత్తం 130 బాక్సుల్లో ఉన్న 6,240 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ ఎస్సై సత్యవాణి తెలిపారు. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అమర్‌బాబు, రాజోలు సీఐ పి.శ్రీనివాస్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యురాలు పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని