ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని అబూఝ్‌మడ్‌ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పుర్‌, కాంకేర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Published : 01 May 2024 05:34 IST

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం

దుమ్ముగూడెం, చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని అబూఝ్‌మడ్‌ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పుర్‌, కాంకేర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన జరిగిన రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ దండకారణ్యం నెత్తురోడింది. ఏప్రిల్‌ 16న కాంకేర్‌ జిల్లాలో 29 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టులు అబూఝ్‌మడ్‌లో సమావేశం అవుతున్నారన్న నిఘావర్గాల సమాచారంతో డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌), ఎస్టీఎఫ్‌(స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌) బెటాలియన్ల నేతృత్వంలోని బృందాలు సోమవారం రాత్రి నుంచి గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో టేక్మెట, కాకూరు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య 3 గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47 రైఫిల్‌తోపాటు పేలుడు పదార్థాలు, కిట్‌ బ్యాగులు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ సాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరికొందరు పరారయ్యారని, భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ మీడియాకు తెలిపారు. తాజా ఘటనతో కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 91 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల అనంతరం ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి విజయ్‌శర్మ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్చల ద్వారా ఈ విషయానికి పరిష్కారం చూపాలని భావిస్తోంది. చిన్నా, పెద్దా ఏ మావోయిస్టు దళంతోనైనా వీడియోకాల్‌ లేదా మధ్యవర్తుల ద్వారా చర్చలకు సిద్ధం. జనజీవన స్రవంతిలో కలవండి’’ అని మావోయిస్టులకు పిలుపునిచ్చారు.

బీజాపుర్‌లో 16 మంది లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో 16 మంది మావోయిస్టులు మంగళవారం ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ ఎదుట లొంగిపోయారు. దండకారణ్యం ప్రాంతానికి చెందిన వీరంతా కొంతకాలంగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పుర్‌ జిల్లాలోని ఆముదై మైన్స్‌లో కూలి పనులకు వెళ్లివస్తూ మావోయిస్టులు అమర్చిన ఐఈడీపై అడుగు వేయడంతో అది పేలి కార్మికుడు ముఖేష్‌ పటేల్‌(38) మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు