Crime News: వైజాగ్‌ నుంచి ముంబయికి.. ఏసీ బోగీల్లో గంజాయి..

విశాఖపట్నం నుంచి ముంబయికి రైల్లోని ఏసీ బోగీల్లో భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న 14 మందితో కూడిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు

Published : 10 Dec 2021 07:25 IST

వైజాగ్‌ నుంచి ముంబయికి రైలులో తరలించేయత్నం

లింగంపల్లి స్టేషన్‌లో 14 మంది అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న రైల్వే డీఎస్పీ చంద్రభాను

నాంపల్లి, న్యూస్‌టుడే: విశాఖపట్నం నుంచి ముంబయికి రైల్లోని ఏసీ బోగీల్లో భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న 14 మందితో కూడిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.67.20 లక్షల విలువైన 336 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం హైదరాబాద్‌ అర్బన్‌ రైల్వే డీఎస్పీ చంద్రభాను, జీఆర్‌పీ నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌, భరత్‌నగర్‌ ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌కుమార్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. అరకు లోయ సమీపంలోని పెదలబుడు గ్రామానికి చెందిన శెట్టి మహాదేవి అలియాస్‌ మాధురి(26) రైతుల నుంచి గంజాయి కొనుగోలు చేసి ముంబయిలో విక్రయిస్తుంటుంది. తాజాగా 336 కిలోల డ్రై గంజాయిని రైలులో ముంబయికి తరలించేందుకు అరకు లోయకు చెందిన దుర్యాకృష్ణ(29), వసంత రవి(27), డోర విజయ్‌కుమార్‌(30), వంతల లైబన్‌(29), వంతల తులసీదాసు(19), శెట్టి ప్రవీణ్‌కుమార్‌(19), వంతల మల్లేశ్వరి(29), వసంత సుహాసిని(26), శెట్టి రాధామణి(32), శెట్టి పద్మ(50), వంతల కుమారి(31), పూజారి గంగ(20)తో పాటు ఓ బాలుడి(17)తో ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. వారు లగేజీ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను దాచుకుని.. చంకలో చంటి పిల్లలను ఎత్తుకుని ఈ నెల 7న అరకు నుంచి వైజాగ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ లోకమాన్య తిలక్‌ రైలు(ఎల్‌టీటీ)లోని ఏసీ కోచ్‌లు బీ1, బీ2, బీ3ల్లో ముంబయికి ప్రయాణమయ్యారు. ఏసీ బోగీల్లో అయితే ఎవరికీ అనుమానం రాదని భావించారు. రైల్వే ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు బుధవారం లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకోగానే రైల్వే అండ్‌ రోడ్స్‌ సేఫ్టీ అడిషనల్‌ డీజీపీ సందీప్‌ శాండిల్య ఆధ్వర్యంలో నాంపల్లి రైల్వే, లింగంపల్లి ఆర్‌పీఎఫ్‌ పోలీసులు మహాదేవి సహా 14 మందిని పట్టుకున్నారు. 24 లగేజీ బ్యాగులు, సూట్‌కేసుల్లో దాచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని