మద్యం అమ్ముతున్నాడని దాడి.. దివ్యాంగుడి మృతి

గొలుసు దుకాణం ద్వారా మద్యం అమ్మకాలు చేస్తున్నారనే కారణంపై విచారణకు వచ్చిన కానిస్టేబుళ్లు దాడి చేయడంతో దివ్యాంగుడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం,

Published : 27 Jan 2022 04:31 IST

పోలీసులే కొట్టారని బంధువుల ఆరోపణ

టంగుటూరు, న్యూస్‌టుడే: గొలుసు దుకాణం ద్వారా మద్యం అమ్మకాలు చేస్తున్నారనే కారణంపై విచారణకు వచ్చిన కానిస్టేబుళ్లు దాడి చేయడంతో దివ్యాంగుడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, ఎం. నిడమానూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరపల్లి రామిరెడ్డి, జయమ్మల కుమారుడు లక్ష్మీనారాయణరెడ్డి (36) పుట్టుకతోనే దివ్యాంగుడు. దీంతో ఆయన గ్రామంలోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఉదయం 11 గంటల సమయంలో విచారణ కోసం నలుగురు కానిస్టేబుళ్లు గ్రామానికి వచ్చారు. అదే సమయంలో లక్ష్మీనారాయణరెడ్డి దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ పోలీసులకు కనిపించారు. దీంతో పోలీసులు దుకాణ నిర్వాహకుడిని తీవ్రంగా కొట్టారని బంధువులు ఆరోపించారు. దుకాణంలో సోదాలు చేయగా మద్యం దొరక్క పోవడంతో ఆయనని తమతోపాటు వెంటబెట్టుకుని ఇంటి వద్దకు తీసుకెళ్లారు. ఇంట్లో కూడా సోదాలు చేశారు. అదే సమయంలో లక్ష్మీనారాయణరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సీఐ లక్ష్మణ్‌, ఎస్సై నాయబ్‌ రసూల్‌ సంఘటనా స్థలానికి చేరుకొని బంధువులతో మాట్లాడారు. పోలీసులు కొట్టడం వల్లనే మృతి చెందాడని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై ఎస్సై మాట్లాడుతూ గుండె సబంధిత సమస్యతో బాధపడుతున్న లక్ష్మీనారాయణ అనారోగ్యం వల్లనే మృతి చెందాడని.. పోలీసులు కొట్టలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని