
TS News: ప్రేమించి పెళ్లాడారు.. విడిపోయి అదృశ్యమయ్యారు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దల కౌన్సెలింగ్ తర్వాత వేర్వేరుగా ఉంటున్నారు.. వారం రోజుల్లోనే ఇద్దరూ వేర్వేరుగా అదృశ్యం కావడంతో యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీనగర్లో నివసించే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పెంటయ్య కుమారుడు టోనిరాజ్(23) గత నెల 27న తాను ప్రేమించిన యువతిని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఇరువర్గాల పెద్దలు కూర్చొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తానని తేల్చిచెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులతో వెళ్లగా యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా 3న గజ్వేల్‌లో నివసించే స్వప్న తండ్రి పెంటయ్యకు ఫోన్ చేశారు. తన కుమార్తె కనిపించడం లేదని తెలియజేయగా అనుమానం వచ్చిన టోనీరాజ్ తండ్రి కుమారుడికి ఫోన్ చేశాడు. చరవాణి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.