కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం.

Updated : 27 Apr 2024 05:03 IST

రెండు వేర్వేరు ఘటనల్లో 20 మందికి గాయాలు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. కళ్యాణదుర్గం డిపోకు చెందిన బస్సు శుక్రవారం సాయంత్రం బళ్లారి నుంచి 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మార్గమధ్యలో మల్లికార్జునపల్లి వద్ద బస్సుకు గేదె అడ్డుగా వచ్చింది. డ్రైవర్‌ దాన్ని తప్పించేందుకు యత్నించారు. బస్సు నియంత్రణలోకి రాకుండా, రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొని గుంతలో బోల్తాపడింది. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న స్థానికులు, దారిన వెళ్లేవారు గమనించి వచ్చి, ఒక్కొక్కరిని బయటకు తెచ్చారు. గాయాలపాలైన సుమారు 20 మందిని 108 వాహనాల్లో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


పెనుకొండలో ప్లాట్ఫాం మీదకు..

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ప్లాట్‌ఫాం పైకి శుక్రవారం రాత్రి ఓ బస్సు దూసుకెళ్లడంతో ప్రయాణికులు భీతిల్లారు. డ్రైవర్‌ గంగాధర్‌ కథనం మేరకు.. పుట్టపర్తిలో బయల్దేరి హిందూపురం వెళ్తున్న బస్సు మార్గమధ్యన పెనుకొండ బస్టాండులోకి వచ్చింది. అక్కడ ప్రయాణికులను దించేందుకు వెళ్లగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్‌ అయి, ప్లాట్ఫాం మీదకు దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. నిత్యం హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు మధ్య తిరిగే ఈ బస్సుకు ఎప్పుడో కాలం చెల్లిందని తెలుస్తోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని