అంతర్జాతీయ కోడ్‌తో వాట్సప్‌ కాల్స్‌!

బంజారాహిల్స్‌ వాసి దినేశ్‌కు +84 (వియత్నాం) కోడ్‌తో మొదలయ్యే నంబర్‌ నుంచి వాట్సప్‌ వీడియోకాల్‌ వచ్చింది. అది విదేశీ నంబర్‌ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్‌ చేయలేదు.

Published : 27 Apr 2024 06:05 IST

చేసేది ఉత్తరాది సైబర్‌ మోసగాళ్లే
పార్ట్‌టైం ఉద్యోగాలంటూ ఆఫర్లు
నమ్మి వివరాలిస్తే మోసపోయినట్లే
డీవోటీ, టీఎస్‌సీఎస్‌బీ నిపుణుల అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ వాసి దినేశ్‌కు +84 (వియత్నాం) కోడ్‌తో మొదలయ్యే నంబర్‌ నుంచి వాట్సప్‌ వీడియోకాల్‌ వచ్చింది. అది విదేశీ నంబర్‌ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్‌ చేయలేదు. కొంతసేపటికే మళ్లీ అదే నంబర్‌తో వీడియోకాల్‌ రావడంతో లిఫ్ట్‌ చేసి మాట్లాడారు. తమది విదేశీ సంస్థ అని చెప్పిన అవతలి వ్యక్తి .. ఆన్‌లైన్‌ ద్వారా తాము అప్పగించిన పనిని చేస్తే రోజుకు రూ.వేలల్లో సంపాదించుకోవచ్చని చెప్పారు. పార్ట్‌టైం జాబే కదా అని నమ్మిన దినేశ్‌ అందుకు అంగీకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్‌ రుసుం పేరిట మొదలుపెట్టి రూ.54 వేలు కాజేశాక గానీ తాను మోసపోయానని దినేశ్‌ గ్రహించలేకపోయారు. హైదరాబాద్‌లో వందల సంఖ్యలో వాట్సప్‌ వినియోగదారులకు కొద్దిరోజులుగా ఇదే తరహాలో వీడియో, వాయిస్‌కాల్స్‌ సర్వసాధారణమయ్యాయి. +60 (మలేసియా), +62 (ఇండోనేసియా), +251 (ఇథియోపియా), +254 (కెన్యా).. తదితర విదేశీ నంబర్ల నుంచి కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో ఈ తరహా కాల్స్‌ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. విదేశాలకు వెళ్లి కొద్దిరోజులు ఉండేవారి కోసం కొందరు సర్వీస్‌ ప్రొవైడర్లు విదేశీ నంబర్లను తాత్కాలికంగా కేటాయిస్తుండటాన్ని నేరగాళ్ల ముఠాలు అవకాశంగా మలచుకున్నాయి. ఆయా తాత్కాలిక నంబర్లతో వాట్సప్‌ రిజిస్టర్‌ చేశాక సిమ్‌ వినియోగించకపోయినా వాట్సప్‌ పనిచేసే అవకాశం ఉండటంతో కాల్‌ స్పూఫింగ్‌ ద్వారా తమ నేరాలకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

సాఫ్ట్‌వేర్‌ ఆధారిత కాల్స్‌..

వందల మందికి వరుసపెట్టి వాట్సప్‌లో వాయిస్‌, వీడియోకాల్స్‌ వస్తుండటంపై సైబర్‌ భద్రత నిపుణులు ఆరా తీశారు. దీనివెనక సాఫ్ట్‌వేర్‌ ఆధారిత టూల్స్‌ ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. సైబర్‌ నేరస్థులు వేల ఫోన్‌ నంబర్లను ఆ టూల్స్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఆయా నంబర్లకు ఫోన్లు చేసినా లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపినా అవతలవారికి విదేశీ నంబర్లలాగే కనిపిస్తాయి. కానీ చేసేది దేశంలోని ఉత్తరాది ముఠాలే అని సైబర్‌ భద్రత నిపుణుల విచారణలో వెల్లడైంది. ఆయా ఫోన్‌ కాల్స్‌కు స్పందిస్తే హిందీలో మాట్లాడుతుండటం, ఆంగ్లంలో మాట్లాడినా విదేశీ యాస లేకపోవడాన్ని బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు.

రిక్‌విన్‌ అస్త్రంతో ఉపశమనం

ఈ మోసాల నేపథ్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డీవోటీ), తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ)లు అప్రమత్తమయ్యాయి. గుర్తు తెలియని విదేశీ నంబర్లతో వాట్సప్‌ వాయిస్‌, వీడియోకాల్స్‌ వస్తే స్పందించకపోవడమే ఉత్తమమని టీఎస్‌సీఎస్‌బీ ‘ఎక్స్‌’ వేదికగా అప్రమత్తం చేస్తోంది. అలాంటి కాల్స్‌ వచ్చిన వెంటనే ఆయా నంబర్లను బ్లాక్‌ చేయడంతోపాటు వాట్సప్‌లో వచ్చే తాజా వెర్షన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తోంది. డీవోటీ ఆధ్వర్యంలోని ‘సంచార్‌ సాథి’ పోర్టల్‌లో ‘రిపోర్ట్‌ ఇన్‌కమింగ్‌ ఇంటర్నేషనల్‌ కాల్‌ విత్‌ ఇండియన్‌ నంబర్‌ (రిక్‌విన్‌)’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాంటి కాల్స్‌ను రిసీవ్‌ చేసుకున్న బాధితులు ఆ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ నంబర్లపై డీవోటీ నిఘా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని