logo

వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు.

Published : 20 May 2024 02:59 IST

దున్ని సిద్ధం చేసిన భూమి

ఆసిఫాబాద్, న్యూస్‌టుడే : వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రతిపాదించారు. మరికొన్ని రోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇప్పటికే రైతులు పంట భూములను దున్ని సిద్ధం చేశారు. ఈ సారి జూన్‌ ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు.  

వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో అన్నదాతలకు ఎరువుల కొరత లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. జూన్‌లో భారీ వర్షం కురవగానే విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు ఫర్టిలైజర్, విత్తన దుకాణాల వారు సైతం వాటి విక్రయానికి అందుబాటులో ఉంచారు. రైతులు తమ భూములను దున్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో యాసంగి పంటల విక్రయాలు చివరి దశకు వచ్చాయి. అవి పూర్తి కాగానే మళ్లీ వానాకాలం పంటలు వేసేలా సమాయత్తం అవుతున్నారు. 

పత్తి వైపే మొగ్గు

జిల్లాలో వరి, కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, సోయా, మిర్చి, వేరుశనగ, మినుములు, నువ్వులు, ఆముదం.. ఇలా అన్ని రకాల పంటలు 1,10,196 ఎకరాల్లో, వాణిజ్య పంట పత్తి 3.50 లక్షల ఎకరాల్లో సాగవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అంటే మొత్తంగా పరిశీలిస్తే అన్ని రకాల పంటలు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళిక సిద్ధం చేశారు. సింహ భాగం పత్తి సాగు ఉండటంతో.. ఏడు లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. అన్ని రకాల పంటలకు 18,122 టన్నుల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా సిద్ధం చేశారు. 

85,916 క్వింటాళ్ల ఎరువులు అవసరం

జిల్లాలో వానాకాలం సీజన్‌లో సాగయ్యే పంటల కోసం 85,916 క్వింటాళ్ల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటిలో యూరియా 45,060 క్వింటాళ్లు, డీఏపీ 11,265 క్వింటాళ్లు, ఎంఓపీ 4053 క్వింటాళ్లు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,538 క్వింటాళ్లు, సూపర్‌ పాస్పేట్‌ మూడు వేల క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు సిద్ధం చేశారు. ఏ నెలలో ఎంత మేర అవసరం అవుతాయని ప్రణాళిక సిద్ధం చేసి ప్రతిపాదించారు.  ప్రైవేటులో ఎరువులు కాస్త అధిక ధరలు ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఎరువులు తెప్పించి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి

వానాకాలం సీజన్‌ మొదలు కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరను చూసి కొనుగోలు చేస్తే.. పంట నష్టం జరిగినపుడు పరిహారం పొందే వీలు లేకుండా పోతుంది. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాల నుంచి కొందరు దళారులు నకిలీ విత్తనాలను జిల్లాలోని అమాయక రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికే కొన్ని చోట్ల పోలీసులు నకిలీ విత్తనాలు పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు నిషేధిత గడ్డి మందును సైతం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. నకిలీలను అడ్డుకునేలా వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేస్తున్నా.. పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నట్లు ప్రచారం ఉంది. పట్టుబడినా ఇట్టే బయటకు రావడంతో.. వారిలో భయం లేకుండా పోతోంది. అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని