logo

చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు

కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి.

Published : 30 Apr 2024 02:59 IST

నర్సాపూర్‌(జి) మండలంలోని తురాటి సమీపంలో  జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని ఢీకొన్న కారు

నర్సాపూర్‌(జి), న్యూస్‌టుడే: కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు క్షతగాత్రులవుతున్నారు. టైరు పేలిపోవడం, ఇంజిన్‌ మొరాయించడం, లైట్లు లేకపోవడం, నిద్రమత్తులో ఉండడం వంటి కారణాలతో చోదకులు లారీలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. చీకటిపూట వెనక నుంచి వచ్చే వాహనాలకు ఆగి ఉన్న లారీలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాంకేతిక సమస్యతో లారీ రహదారిపై నిలిచిపోతే ఎలాంటి సూచికలు ఏర్పాటుచేయడం లేదు. కనీసం స్థానిక పోలీసులను, జాతీయ రహదారి భద్రత సిబ్బందిని ఆశ్రయిస్తే వారు రేడియంతో కూడిన గుర్తులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే నిలిచిపోయిన వాహనాన్ని రోడ్డు పక్కకు తరలించే ఏర్పాట్లు చేస్తారు.  

ఇటీవల జరిగిన ఘటనలు

  • నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలం నసీరాబాద్‌ సమీపంలో 61వ జాతీయ రహదారిపై ఓ లారీని నిలిపి ఉంచారు. అటు వైపుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు ముందు వైపు నిలిచి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో ఇరువురి గాయాలయ్యాయి. ఈ సంఘటన పగలు జరగడంతో స్థానికులు 108కి సమాచారం అందించగా క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
  • నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలంలోని తురాటి గ్రామ సమీపంలో 61వ జాతీయ రహదారిపై లోడుతో ఉన్న ఓ లారీ నిలిచి ఉండగా రాత్రి సమయంలో వెనుక నుంచి ఓ కారు వచ్చి లారీని ఢీకొంది. క్షతగాత్రుడిని భైంసా ఆసుపత్రికి తరలించారు.  
  • సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ కిందికి కారు దూసుకుపోవడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కిందికి పూర్తిగా కారు దూసుకెళ్లడం చూస్తే.. అది ఎంత వేగంతో ఉందో అర్థమవుతోంది.
  • సూర్యాపేట జిల్లా కోదాడలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొనగా.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని