logo

పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకోండి ఇలా..

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంలో ఎన్నికల కమిషన్‌ కొత్త విధానానికి నాంది పలికింది. ఎ

Published : 23 Apr 2024 02:44 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంలో ఎన్నికల కమిషన్‌ కొత్త విధానానికి నాంది పలికింది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ ఓటుహక్కును రహస్యంగా వినియోగించుకునే నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.   గతంలో ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందికి నేరుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను అందించి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని వెసులుబాటు కల్పించారు. దీంతో ఉద్యోగులను భయపెట్టి కొందరు, పైరవీలు చేసి మరికొందరు, తాయిలాలు అందించి ఇంకొందరు విలువైన ఓట్లును పొందేవారు. ఈదఫా ఇటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా రహస్య విధానంలోనే వీరు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది.

ఎన్నికల విధుల్లో ఉండే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, బీఎల్‌ఓలు, సెక్టోరల్‌ అధికారులు, పోలీసులు, పాత్రికేయులు, వాహనాల డ్రైవర్లు, అత్యవసర సిబ్బంది, స్క్వాడ్‌లో పనిచేసేవారు పోస్టల్‌ బ్యాలెట్‌ను పొందడానికి అర్హులు. ఎన్నికల విధుల్లో ఉండే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందడానికి ఇప్పటికే ఫాం-12 జారీ చేసింది. వీటిని పూర్తిచేసి ఉద్యోగులు వారు ఓటు హక్కు పొందిన నియోజకవర్గానికి చెందిన ఏఆర్‌ఓ, ఈఆర్‌ఓకు  అందివ్వాలి. ఈఆర్‌ఓ, ఏఆర్‌ఓకు ఇవ్వడం ఇబ్బందిగా భావిస్తే  మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయంలో అందించొచ్చు.   జిల్లాలో 14 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. వీరందరికి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పొందడానికి ఫారం-12 ఎన్నికల విధులకు సంబంధించిన ఆదేశాలతోపాటు అందించారు.

మారిన ఓటు వినియోగం విధానం

గతంలో మాదిరిగా ఇంటికి బ్యాలెట్‌ పేపర్లును పంపించే విధానం తొలగించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఫారం-12 అందిస్తే వారికి నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగుల ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఫారం-12 ఇచ్చిన ఉద్యోగులు నేరుగా ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకునే సదుపాయం తీసుకొచ్చారు. ఓటుహక్కు కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రానికి వెళ్తే అక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వడం, ఓటు హక్కును వినియోగించుకుని బ్యాలెట్‌ బాక్స్‌లో వేయడం అంతా ఒకేసారి జరిగిపోయేలా ఏర్పాట్లు చేశారు.

అక్రమాలకు అడ్డుకట్ట.. చెల్లని ఓట్లకు స్వస్తి..

ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవడానికి గత ఎన్నికల్లో ఇబ్బందిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అవగాహన లేక విలువైన ఓటును చెల్లనివిగా మార్చేసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన విధానంతో చెల్లని ఓట్లతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌లో అక్రమాలకు అవకాశం లేకుండాపోయింది. ఉద్యోగులు రహస్యంగా ఓటు వేసుకునే సౌలభ్యం కొత్త విధానం ద్వారా వచ్చింది.

వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో..

ఉద్యోగులు తమ ఓటు హక్కును నియోజకవర్గ కేంద్రాల్లో వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మే 13న సాధారణ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా ఉద్యోగులు మాత్రం మే 4, 5, 6 తేదీల్లో వారి ఓటు హక్కును రహస్యంగా వినియోగించుకుని ప్రమాణ పత్రంతో బ్యాలెట్‌ బాక్స్‌ల్లో వేసుకొనే అవకాశం కల్పించింది. ఈ  తేదీల్లో ఎవరు ఎప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలో అధికారులు విభాగాల వారీగా తెలియజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని