logo

పేరుకే ఆర్టీసీ గ్రూప్‌.. అంతా వైకాపా భజనే

తాను ఆర్టీసీ జోనల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్‌ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు.

Updated : 23 Apr 2024 07:43 IST

వాట్సాప్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్న మాజీ ఛైర్‌పర్సన్‌ పద్మావతి
ఏడు నెలల కిందటే ఆమె పదవీ కాలం పూర్తి

ఆర్టీసీ గ్రూపులో జోగి ప్రచార మెసేజ్‌

ఈనాడు, అమరావతి: తాను ఆర్టీసీ జోనల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్‌ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇటీవల వరకు గ్రూప్‌లో వైకాపా ఎన్నికల ప్రచార చిత్రాలను పోస్టు చేశారు. తామేం తక్కువ కాదన్నట్లు వైకాపా అనుకూల యూనియన్‌ నేతలు కూడా పోటీపడి ఇందులో పోస్టులు పెడుతున్నారు. ఈ గ్రూప్‌లో ఉన్న ఆర్టీసీ అధికారులు కనీసం అభ్యంతరం చెప్పడం కానీ, దీని నుంచి బయటకు రావడం కానీ చేయకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిసినా ఎవరూ నోరుమెదపడం లేదు.

నిత్య ప్రచారం: పెనమలూరు నియోజకవర్గానికి చెందిన తాతినేని పద్మావతిని 2021లో విజయవాడ జోన్‌కు ఛైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు స్వీకరించగానే.. ఆగస్టు, 2021లో ‘ఏపీఎస్‌ ఆర్టీసీ విజయవాడ జోనల్‌ బోర్డు’ పేరుతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఆమెతో పాటు ఎన్‌ఎంయూ నేత అడ్మిన్‌లుగా ఉన్నారు. ఈ గ్రూప్‌లో ఎన్టీఆర్‌ జిల్లా ఆర్‌ఎం, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్‌ఎం, ఆటోనగర్‌, మచిలీపట్నం, గవర్నర్‌పేట-1, గవర్నర్‌పేట-2 డిపోల మేనేజర్లు, పలు కార్మిక సంఘాల నాయకులు 59 మంది సభ్యులుగా ఉన్నారు. సంస్థకు సంబంధించిన సర్క్యులర్లు, ఇతర సమాచారాన్ని పోస్టు చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. గత ఏడాది పద్మావతి పదవీ కాలం పూర్తయినా ఆమె ఆర్టీసీ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చినా.. బేఖాతరు చేస్తూ మంత్రి, పెనమలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ ఎన్నికల ప్రచార చిత్రాలు, వీడియోలను ఇందులో పెద్ద ఎత్తున ఉంచారు. కొంతకాలం నుంచి ఆర్టీసీ ఉద్యోగులైన వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం, వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సమాఖ్య నాయకులు కొందరు వాట్సాప్‌ గ్రూప్‌లో రోజూ జగన్‌, జోగి అనుకూల ప్రచార చిత్రాలను పోస్టు చేస్తున్నారు. పెనమలూరులో పద్మావతి.. చేస్తున్న ప్రచార చిత్రాలను కూడా ఉంచుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఆర్టీసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని