logo

బెజవాడ సీపీగా రామకృష్ణ

విజయవాడ కొత్త పోలీస్‌ కమిషనర్‌గా 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన పీహెచ్‌డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది.

Published : 25 Apr 2024 05:39 IST

విజయవాడ నేరవార్తలు - న్యూస్‌టుడే: విజయవాడ కొత్త పోలీస్‌ కమిషనర్‌గా 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన పీహెచ్‌డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం ఆయన కమిషనరేట్‌లో సీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు. సీపీగా పనిచేసిన కాంతిరాణాను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఎన్నికల సంఘం వేటు ఉత్తర్వులు అందగానే మంగళవారం రాత్రి కాంతిరాణా సీపీ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. కమిషనరేట్‌లో సీనియర్‌ అధికారి అయిన గ్రామీణ డీసీపీ కంచె శ్రీనివాసరావుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కాంతిరాణా స్థానంలో రామకృష్ణ నియమితులయ్యారు. కైకలూరుకు చెందిన రామకృష్ణ.. అక్కడే జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసి.. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ చదివారు. 2001లో గ్రూప్‌-1కు ఎంపికై.. డీఎస్పీగా పోలీసు శాఖలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు.

వి డీఎస్పీగా నల్గొండ జిల్లా దేవరకొండ, వరంగల్‌ జిల్లా పరకాల, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విధులు నిర్వహించారు. తర్వాత 2006 బ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఎస్పీగా సీఐ సెల్‌, ఎస్‌ఐబీలో బాధ్యతలు నిర్వర్తించారు. లా అండ్‌ ఆర్డర్‌లో నెల్లూరు, కడప, గుంటూరు అర్బన్‌, గుంటూరు రూరల్‌, చిత్తూరు ఎస్పీగా పని చేశారు. డీఐజీ హోదాలో సెబ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఐజీగా పదోన్నతి లభించిన తర్వాత.. ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వి మరోవైపు గతంలో చిత్తూరు ఎస్పీగా కాంతి రాణా బాధ్యతలు నిర్వర్తించి బదిలీ అయ్యాక.. ఆ స్థానానికి రామకృష్ణ ఛార్జ్‌ తీసుకున్నారు. ఇప్పుడు కూడా బెజవాడ సీపీగా కాంతి రాణా బదిలీ అయ్యాక.. ఇక్కడ కొత్త సీపీగా రామకృష్ణ బాధ్యతలు తీసుకోనుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని