గుంటూరు మిర్చి మహా ఘాటు
మిర్చియార్డు, న్యూస్‌టుడే
ఆసియా ఖండంలోనే పేరెన్నికగన్న గుంటూరు మిర్చియార్డు నుంచి 40 దేశాలకు పైగానే మిరప ఎగుమతి అవుతుంది. యార్డుకు మిర్చి వచ్చిన వెంటనే వాహనాల నుంచి దింపడం, గ్రేడింగ్, ఎండబెట్టడం, బస్తాల్లో నింపి కుట్టడం, బరువు తూచడం, గోదాముకు తరలించడం, తొడిమలు తీసే ప్రాంతానికి తీసుకెళ్లడం, పని పూర్తయ్యాక కంటైనర్లకు లోడ్ చేయడం, మిగిలింది శీతలగోదాముల్లో నిల్వ చేయడం.. ఇలా పలు దశల్లో వివిధ వర్గాల వారికి ఉపాధి కల్పిస్తుంది. వివిధ దేశాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి వారానికి 600 నుంచి 1000 కంటైనర్ల మిర్చి ఎగుమతి అవుతుంటుందని ఎగుమతి వ్యాపారుల సంఘ నాయకులు వెల్లడించారు.
వేల కోట్లలో లావాదేవీలు
మిర్చియార్డు నుంచి రూ.వేల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఏడాది మిర్చి సీజన్ జనవరి నుంచి మే వరకు నడుస్తుంది. మే నెలలో ఎండలు, వడగాలులు ఎక్కువగా ఉండడం వల్ల అప్పటి పరిస్థితులను బట్టి మొదటి, రెండో వారం నుంచి జూన్ రెండో వారం వరకు మిర్చియార్డుకు సెలవులు ఇస్తారు. మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో 60, 70 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యంతో శీతలగిడ్డంగులు ఉన్నాయి. దేశంలోనే ఒక నగరంలో అధిక శీతలగోదాములు ఉన్న నగరంగా గుంటూరు ఖ్యాతి పొందింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి మిరపకాయలు గుంటూరుకు తీసుకువచ్చి నిల్వ చేస్తున్నారు. శీతలగోదాముల నిర్మాణం, ఏసీలు రావడంతో ఏడాది పొడవునా సరకు లభ్యత, క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారుల రాక పెరిగి దేశ విదేశాలకు ప్రపంచ వ్యాప్తంగా మిర్చి ఏడాది పొడవునా రవాణా చేసే అవకాశాలు మెరుగయ్యాయి. తొడిమలు తీసిన మిరపకాయలకు విదేశాల్లో డిమాండ్ ఉంది. ఇక్కడ సీజన్ సంక్రాంతితో మొదలై మే రెండో వారంతో ముగుస్తుంది. సీజన్లో రోజూ సగటున లక్ష నుంచి లక్షన్నర బస్తాలు యార్డుకు వస్తాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు సరకు యార్డుకు తీసుకువస్తారు. ఉదయం 6 నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభమై సాయంత్రం ముగుస్తాయి. పగటివేళ యార్డులో ధర నిర్ణయం, అమ్మకం, కాటా, బస్తాలకు నింపడం వంటి పనులు పూర్తవుతాయి. బేరం జరిగిన మిర్చిని సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు గోదాములకు తరలిస్తారు. జూన్ నుంచి డిసెంబరు మధ్యకాలంలో శీతలగోదాముల్లో మిర్చిని శాంపిల్స్ ద్వారా విక్రయిస్తారు. యార్డు కేంద్రంగా మిర్చి కార్యకలపాల ద్వారా ఏటా సుమారు రూ.5000 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.