logo
Published : 30/11/2021 06:00 IST

చివరి ఆశలు ఆవిరి

నీటమునిగిన ధాన్యం నుంచి మొలకలు


కాకుమానులో పూర్తిగా నేలవాలిన పంట

ఈనాడు, గుంటూరు: వాతావరణం మేఘావృతం.. అప్పుడప్పుడు జల్లులు.. చలిగాలులు.. వర్షాలు కొనసాగుతాయన్న సమాచారంతో వరి రైతు వణికిపోతున్నాడు. జిల్లాలో 2.07లక్షల హెక్టార్లలో సాగైన వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరికి అనుకూల వాతావరణం నాలుగు శాతం (మొత్తం 104 శాతం) అదనంగా వరి సాగు చేశారు. నవంబరులో వరుసగా కురుస్తున్న వర్షాలు వరి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇటీవల వర్షాలకు పంట మొత్తం నేలవాలి నీటమునిగింది. వర్షం తగ్గడంతో పొలాల్లో నీరు క్రమంగా బయటకు వెళుతోంది. కొన్నిచోట్ల రైతులు ఇంజిన్లు పెట్టి నీటిని బయటకు తోడేస్తున్నారు. ఈక్రమంలోనే మళ్లీ నాలుగురోజుల పాటు వర్షాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న పొలాల రైతులు వరి కోత యంత్రాలతో కోతలు మొదలెట్టారు. కోత కోసినా ధాన్యాన్ని ఆరబెట్టుకునే సౌకర్యం లేకపోవడంతో వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.


పెరిగిన కోత ఖర్చు

పంట నేలవాలడంతో యంత్రంతో కోతకు పట్టే సమయం పెరుగుతోంది. దీనికితోడు డీజిల్‌ ధరలు పెరిగాయని, యంత్రాలకు డిమాండ్‌ ఉందని వరికోత యంత్రాల యజమానులు అద్దె ధర పెంచారు. ఏటా గోదావరి జిల్లాల్లో పూర్తయిన తర్వాత కృష్ణా, అనంతరం గుంటూరులో కోతలు మొదలయ్యేవి. ఈఏడాది గోదావరి జిల్లాల్లో కోతల సమయంలో వర్షాలు రావడంతో యంత్రాలన్నీ అక్కడే ఆగిపోయాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒకేసారి పంట సాగుచేయడంతో ఇప్పుడు రెండు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో వరికోత యంత్రాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం గంటకు రూ.3200 వసూలు చేస్తున్నారు. డెల్టాలో గొలుసుతో నడిచే యంత్రాలతో మాత్రమే కోత సాధ్యమవుతుంది. దీంతో వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మరోవైపు కూలీలతో కోయించాలంటే ఎకరాకు రూ.6వేల వరకు అడుగుతున్నారు. వర్షం వల్ల ఎకరాకు సగటున 5 బస్తాల వరకు ధాన్యం దిగుబడులు తగ్గుతుండగా కోత ఖర్చు పెరగడంతో నష్టాలు తప్పవని కర్షకులు వాపోతున్నారు.


 పెట్టుబడి, కౌలుసొమ్ము రాదాయే 

- కొంగర హనుమంతరావు, రైతు, కాకుమాను

రెండున్నర ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట సాగుచేశా. ఎకరాకు రూ.16వేలు చొప్పున కౌలు చెల్లించా. వరిపైరు సాగు నుంచి ఇప్పటి వరకు ఎకరాకు రూ.20వేలు చొప్పున పెట్టుబడి పెట్టా. వర్షాలకు వాగు నీరు ఎగువ నుంచి రావడంతో నీటమునిగింది. పొలంలో దారులు చేసి నీటిని బయటకు పంపుతున్నాం. వర్షం ఇప్పటితో ఆగితే పెట్టుబడులు అయినా దక్కుతాయి. నాలుగో తేదీ వర్షం ఉందన్న సమాచారంతో వరికోత యంత్రం కోసం చూస్తున్నాం. గంటకు రూ.3200 డిమాండ్‌ చేస్తున్నారు. నేలవాలినందున కోతకు ఎక్కువ సమయం పడుతుంది.


ఈ ఏడాది నష్టాలే..

- నల్లమోతు సుబ్బారావు, రైతు, కాకుమాను

సొంత పొలం ఎనిమిది ఎకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశా. నిరుడు సరిగ్గా నవంబరులో వచ్చిన తుపాను వల్ల పంట మొత్తం నేలవాలి నీటమునిగి నష్టపోయాం. ఈఏడాది కూడా కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షం వల్ల నష్టం జరుగుతోంది. పంట మొత్తం నేలవాలడంతో అక్కడక్కడా ధాన్యం నుంచి మొలకలు వస్తున్నాయి. మళ్లీ వర్షం వస్తే పంట చేతికి చిక్కదని ముందుగానే కోతకు సిద్ధమయ్యాం. కోత కోసిన ధాన్యం 76 కిలోల బస్తా రూ.1100కు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 25బస్తాలు మించి రావడం లేదు. ఇందులో కౌలు 12 బస్తాలు ఇస్తే మాకు మిగిలేది ఏముంది? రెండేళ్లుగా ఇదే పరిస్థితి. గత్యంతరం లేక వరి సాగుచేసి నష్టపోతున్నాం.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని