logo

తుది పోరుకు సై

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది.

Updated : 30 Apr 2024 05:05 IST

బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు

లోక్‌సభకు 21... అసెంబ్లీకి 113

 మొత్తం 23 మంది ఉససంహరణ

 జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది. అనంత లోక్‌సభ ఆర్‌ఓ/కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో సంబంధిత ఆర్‌ఓలు ఎక్కడికక్కడ బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో తుది పోరుకు తెర లేచింది. ఆర్‌ఓల వెల్లడించిన జాబితా ప్రకారం.. అనంత లోక్‌సభకు 21 మంది బరిలో ఉన్నారు. ఒక్కరూ నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తెదేపా నుంచి అంబికా లక్ష్మినారాయణ, వైకాపా తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా వజ్జల మల్లికార్జునతోపాటు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపితే మొత్తం 21 మంది పోటీలో నిలిచారు. వీరందరికి ఆర్‌ఓ/కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు. తుది జాబితా ఖరారు కావడంతో ప్రచార హోరు కొనసాగనుంది. మే 11వ తేదీ దాకా ఎన్నికల ప్రచారం ఉంటుంది. 13న పోలింగ్‌ జరగనుంది.

తాడిపత్రిలో 18, ఉరవకొండలో 11

జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 113 మంది పోటీలో ఉన్నారు. ఉరవకొండలో మినహా తక్కిన ఏడు చోట్లా 23 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తుది పోరులో 113 మంది నిలబడ్డారు. తాడిపత్రిలోనే ఎక్కువగా 18 మంది బరిలో ఉండటం విశేషం. తక్కువగా ఉరవకొండలో పదకొండు మంది ఉన్నారు. అనంత అర్బన్‌, కళ్యాణదుర్గంలో 15 మంది చొప్పన, శింగనమల, గుంతకల్లులో 14 మంది, రాయదుర్గం, రాప్తాడులో 13 మంది చొప్పున పోటీలో నిలిచారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏకంగా 8 మంది నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. అనంత అర్బన్‌లో ఆరుగురు, గుంతకల్లులో ముగ్గురు, శింగనమల, రాప్తాడులో ఇద్దరు ప్రకారం, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ఒక్కొక్కరు తమ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు.

ఆ రెండు చోట్లా.. రెండేసి ఈవీఎంలు

అభ్యర్థుల జాబితా ఖరారు కావడంతో ఎన్నికల గుర్తుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది పేర్లు, గుర్తులు మాత్రమే కేటాయించడానికి అవకాశం ఉంది. ఇందులో 15 మంది అభ్యర్థులు, ఒక నోటా గుర్తు ఉంటాయి. ఇంత కంటే ఎక్కువ మంది ఉంటే రెండో ఈవీఎం తప్పనిసరిగా ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో అనంత లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండేసి ఈవీఎంలు ఉంటాయి. ఎందుకంటే.. అనంత లోక్‌సభ బరిలో 21 మంది, తాడిపత్రి పోటీలో 18 మంది చొప్పున ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్‌లో లోక్‌సభ ఈవీఎంలు రెండు, అసెంబ్లీ స్థానానికి ఒకటి ఉంటాయి. తాడిపత్రి పరిధిలో లోక్‌సభకు సంబంధించి రెండు, అసెంబ్లీ స్థానానికి మరో రెండు... ఇలా ఒక్క తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ప్రతి పోలింగు కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని