logo

Roja: మంత్రి గారూ మీ శాఖ గుర్తుందా?

అధికార పార్టీలో మంత్రి ఆర్‌కే రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుపతితో ఆమెకున్న అనుబంధం గురించి స్థానికులతోపాటు రాష్ట్ర ప్రజలకూ ఎరుకే..! పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం దక్కడంతో ఆ రంగంలో తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం జిల్లావాసుల్లో వ్యక్తమైనా అవన్నీ అడియాసలు చేశారన్న విమర్శలు లేకపోలేదు.

Updated : 26 Dec 2023 07:40 IST

ఆదాయమున్నా నిలువ నీడలేక..
జిల్లాలో పర్యాటకాభివృద్ధి శూన్యం

అలిపిరి సమీపంలో అసంపూర్తిగా ఉన్న పర్యాటక శాఖ భవనం

న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక): అధికార పార్టీలో మంత్రి ఆర్‌కే రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుపతితో ఆమెకున్న అనుబంధం గురించి స్థానికులతోపాటు రాష్ట్ర ప్రజలకూ ఎరుకే..! పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం దక్కడంతో ఆ రంగంలో తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం జిల్లావాసుల్లో వ్యక్తమైనా అవన్నీ అడియాసలు చేశారన్న విమర్శలు లేకపోలేదు.


ఏటా రూ.70 కోట్ల ఆదాయం

తిరుపతి డివిజన్‌ విస్తరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏటా 8 లక్షల మంది పర్యాటకులు వస్తున్నట్లు అంచనా. నెలకు కనిష్ఠంగా రూ.6-7 కోట్లు, ఏడాదికి రూ.70 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. డివిజన్‌లో 250 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో పదిమంది మాత్రమే శాశ్వత ఉద్యోగులున్నారు.


కార్యాలయం లేక పరువుపోతోంది

అలిపిరిలోని రూయా ఆసుపత్రి ఎదుటనున్న ఎకరం స్థలంలో 2013లో రూ.17 కోట్ల అంచనాలతో పర్యాటకశాఖ బహుళ ప్రయోజనార్థం హరిత హోటల్‌ భవన సముదాయం నిర్మాణం చేపట్టారు. అందులో 110 గదులు, 200 మంది సామర్థ్యంగల హోటల్‌, అత్యాధునికమైన సమావేశ మందిరం, శాఖ డివిజన్‌ కార్యాలయం, కేంద్రీయ విచారణ కార్యాలయం ఇందులో ఉండేలా నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే రూ.11 కోట్లు ఖర్చుచేశారు. పెరిగిన అంచనాలను అనుసరించి మరో రూ.15 కోట్లు వెచ్చిస్తే పర్యాటకశాఖకు అత్యాధునిక భవనం సమకూరుతుంది. అద్దెల భారం నుంచి విముక్తి లభించడంతోపాటు నెలకు రూ.7 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా ‘రివర్స్‌’ దెబ్బకు ఎవరూ ముందుకు రావడం లేదు.


పర్యాటకులు ఉన్నచోటే అభివృద్ధి:  ఫిబ్రవరిలో మంత్రి ఆర్‌కే రోజా

టెంపుల్‌ టూరిజంలో రాష్ట్రం ముందుంది. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. పర్యాటకులు ఉన్నచోట అభివృద్ధి చేస్తేనే మరింత ప్రయోజనం ఉంటుంది. లేనిచోట ఖర్చుచేస్తే ఎవరూ రారు.


అభివృద్ధి ఊసేలేదు

తిరుపతి డివిజన్‌ అభివృద్ధికి మంత్రి చొరవ చూపిన దాఖలాలు కనిపించడం లేదు. పలు పర్యాటక ప్రాజెక్టులు పడకేయడంతో ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. హార్సిలీహిల్స్‌, పులిగుండు, తలకోన, కుప్పం, పుత్తూరు, శ్రీకాళహస్తి, పలమనేరులోని అతిథిగృహాలు సౌకర్యాల మెరుగు కోసం ఎదురుచూస్తున్నాయి. తలకోనను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళికలు ముందుకు సాగలేదు. చంద్రగిరి కోటను పూర్తిగా విస్మరించారు.


చివరకు కళాశాలలో మకాం

1999లో ఏర్పాటైన తిరుపతి డివిజన్‌కు సొంత కార్యాలయం లేదు. 2003లో శ్రీనివాసంలో కొన్ని గదులు కేటాయించగా 2011లో వాటిని వెనక్కి తీసుకోవడంతో అద్దె గదులే దిక్కయ్యాయి. 2019లో తిరుచానూరులో నిర్మించిన పద్మావతి అతిథి భవనాన్ని లీజు ప్రాతిపదికన అప్పగించినా కలెక్టరేట్‌ కోసం తిరిగి ఖాళీ చేయించారు. అటు శ్రీదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కేంద్రీయ విచారణ కార్యాలయం సైతం ఖాళీ చేయాల్సి రావడంతో ప్రస్తుతం అలిపిరి మార్గంలోని రాష్ట్ర హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఆశ్రయం పొందుతున్నారు.


మనుగడ ఉన్నచోటే నిర్లక్ష్యం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, హార్సిలీహిల్స్‌, శ్రీకాళహస్తి, కుప్పం, చంద్రగిరి కోట, కైలాసనాథ కోన, పులిగుండు వంటి పర్యాటక కేంద్రాలున్నాయి. తిరుమల, స్థానిక ఆలయాల దర్శన ప్యాకేజీలతోపాటు జిల్లాలోని రిసార్టులు, కాటేజీలు, అద్దె గదులు, సమావేశ మందిరాలు, హోటళ్లు, ఇతర సదుపాయాల ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వస్తోంది. తితిదే అమలు చేస్తున్న దర్శనం ప్యాకేజీలతోనే ఏటా రూ.50 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నారు. ప్యాకేజీల నిర్వహణకు అవసరమైన బస్సులు, ఇతర సౌకర్యాల కొరత వేధిస్తున్నాయి. ప్రస్తుతం 28 అత్యాధునిక వసతులుగల బస్సులు, ఇతర వాహనాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని