పేదల పాలిట.. వి‘నాసి’కారే..!

రాష్ట్ర, చీప్‌ లిక్కర్‌కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్‌ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు.

Updated : 19 Apr 2024 11:09 IST

ప్రభుత్వ దుకాణాల్లో 80% విక్రయాలు చీప్‌లిక్కరే
ప్రాణాలు తోడేస్తున్న జగన్‌ సర్కార్‌

రహదారిపైనే తాగుతూ..

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: రాష్ట్ర, చీప్‌ లిక్కర్‌కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్‌ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. పేదలను మత్తులో ముంచి ఆదాయం కొల్లగొట్టి ప్రభుత్వ బండిని నడిపిస్తున్నట్లు విక్రయాల లెక్కలు చూస్తేనే తేటతెల్లమవుతోంది. జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు 242 ఉండగా వాటిలో 80% వరకు విక్రయాలు చీప్‌ లిక్కర్‌వేకాగా కష్టజీవులు వాటినే ఆశ్రయిస్తూ ప్రాణాలుపణంగా పెడుతున్న దుస్థితి రాష్ట్రంలో కళ్లకు కడుతోంది.

  • ఒకప్పుడు రాష్ట్రంలో నాటుసారాతోపాటు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో తయారుచేసే కల్తీ మద్యం లభించేది. ఈ నాసిరకం మద్యం తాగి ఎందరో మృత్యువాత పడేవారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం మద్యం తయారీలో రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ కాకుండా ఎలక్ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (ఈఎన్‌ఏ) వినియోగించేలా అన్ని డిస్టిలరీలలో అమలు చేయడంతో మద్యం నాణ్యత మెరుగుపడింది. ప్రస్తుతం మద్యం తయారీలో అదే విధానం అమలవుతుందని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ దుకాణాల్లో దొరికే మద్యంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

దొంగచాటు విక్రయాలు

  • ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరిచేంత వరకు మందుబాబులు కాపు కాస్తుంటారు. దీన్నే ఆసరాగా తీసుకుని కొందరు దుకాణ సిబ్బంది దొంగచాటుగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పక్కన చిల్లర దుకాణంలో గ్లాసు, నీళ్ల పొట్లం తీసుకుని దారిపైనే తాగుతూ కనిపిస్తున్నారు.
  • తిరుపతి నగరంలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన మురళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిత్యం ప్రభుత్వ మద్యం దుకాణంలోని చీప్‌ లిక్కర్‌ తాగేవారు. మత్తు నుంచి ఉపశమనం కోసం కుటుంబ సభ్యులు రుయాలోని మత్తువ్యసన నిర్మూలన కేంద్రాన్ని ఆశ్రయించారు. వైద్యం అందించినా అప్పటికే ఆయన కాలేయం, మూత్రపిండాలు బాగా దెబ్బతినడంతో కొంతకాలం తర్వాత మృతిచెందారు.  
  • చంద్రగిరి మండలానికి చెందిన వ్యక్తి ప్రభుత్వ మద్యం దుకాణంలో రోజూ తక్కువ ధరకు లభించే మద్యం తాగేవారు. కొంతకాలానికి అన్నం తినలేక, నిలబడలేని స్థితికి వెళ్లడంతో స్విమ్స్‌కు తీసుకొచ్చారు. మద్యం అధికంగా తీసుకోవడంతో మూత్రపిండాలతోపాటు గ్యాస్ట్రిక్‌ సమస్య ఎదురైంది. సకాలంలో చికిత్స తీసుకోవడంతో కొంతమేరకు కోలుకున్నారు.

అధికార పార్టీ నేతల చేతుల్లోనే

రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలు ఎక్కువగా అధికార పార్టీ నేతలకు చెందినవి కావడంతో బాట్లింగ్‌ యూనిట్‌లోని డిస్టిలరీ సర్టిఫైడ్‌ అధికారి చూసీచూడనట్లు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ తరహా చీప్‌ లిక్కర్‌ బాటిళ్లను పక్క రాష్ట్రాల్లో తనిఖీ చేయించి నాసిరకంగా తయారు చేస్తున్నట్లు ఆరోపించడం ఇందుకు నిదర్శనం. తక్కువ ధరకు లభించే స్పిరిట్‌ తెచ్చి కొన్ని రంగులు (ఎసెన్స్‌) కలిపి లిక్కర్‌గా తయారు చేసి మందుబాబులు వాడిపడేసిన మద్యం సీసాల్లో నింపి తక్కువ ధరలకు గతంలో విక్రయించారనే ఆరోపణలున్నాయి.


ఇచ్చిన బ్రాండ్లే తాగాలి

ప్రభుత్వ దుకాణాల్లో ఒకరోజు ఉన్న మద్యం మరోరోజు అందుబాటులో లేకపోవడంతో రూ.180 మందు.. రూ.210 మందు ఇమ్మని అడిగే పరిస్థితి నెలకొంది. బ్రాండ్‌ పేరు చెబితే వెర్రిచూపులు చూస్తున్నారు. ఒకప్పటి పేరుగాంచిన మద్యం బ్రాండ్లు, బీర్లు  కావాలంటే బార్లకు వెళ్లి అధిక ధర చెల్లించక తప్పదు. కొన్ని బ్రాండ్ల మద్యం దుకాణాలకు వచ్చినా అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారే తప్ప సామాన్యులకు అందడం లేదు.


ఆరుగురి బలి.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రోజుకొక బ్రాండ్‌తో నాసిరకం మద్యం విక్రయాలు చేస్తున్నారు. కూలీనాలి చేసి వచ్చిన డబ్బుతో పేదలు ఈ మద్యాన్ని కొనుక్కుని తాగి కిడ్నీలు దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నారు. దొరవారిసత్రం మండలంలోని పాలెంపాడులో ఇప్పటికే ఆరుగురు కిడ్నీ లు దెబ్బతిని మృతి చెందారు. మరో ఇద్దరు మం చాన పడ్డారు.

బందిల మోహన్‌, అమ్మా ఛారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌, పాలెంపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని