logo

ఈసారీ నాణ్యతకు పరీక్షే!

జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్‌లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Published : 20 May 2024 05:44 IST

పలుచోట్ల అందుబాటులోకిరాని అగ్రి ల్యాబ్‌లు పిడింగొయ్యి: భవనం లోపల పూర్తికాని పనులు

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్‌లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఏడు నియోజక వర్గాలుండగా.. రెండుచోట్ల మాత్రమే ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. ఇంకోచోట పూర్తిగా ల్యాబ్‌ అందుబాటులోకి రాకపోగా.. మరోచోట భవన నిర్మాణం పూర్తయినా ల్యాబ్‌ పరికరాలు ఏర్పాటు చేయక ప్రారంభం కాలేదు. మరో రెండుచోట్ల భవన నిర్మాణాలే పూర్తికాలేదు. 
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లు గడిచినా ఇంకా పలుచోట్ల ల్యాబ్‌ భవన నిర్మాణాలే పూర్తి చేయలేకపోయింది. ఒకపక్క జూన్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ల్యాబ్‌లు అందుబాటులోకి రాక విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలకు నమూనాలు (శాంపిల్స్‌)ను వేరేచోటకు పంపించాల్సిన పరిస్థితి. 

ఇలా చేయాలని..

జిల్లాలో రాజమహేంద్రవరం అర్బన్‌ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్‌లను ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే మంజూరు చేసింది. సుమారు 600 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.75-80 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిలో ఒక్క ల్యాబ్‌ భవన నిర్మాణానికి రూ.55 లక్షలు అంచనా వ్యయం కాగా.. మిగతా నిధులు పరికరాలు, ఫర్నీచర్‌ వంటివి సమకూర్చే నిమిత్తం వెచ్చించాల్సి ఉంది. 

ఇవీ కారణాలు: నిధుల మంజూరులో తీవ్ర జాప్యం... చేసిన పనులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం.. అంచనాలు సవరించకుంటే పనులు చేయలేమని గుత్తేదారులు చేతులెత్తేయడం తదితర కారణాలతో కొన్నిచోట్ల అగ్రి ల్యాబ్‌లు నేటికీ అందుబాటులోకిరాని పరిస్థితి.


ఇదీ ప్రస్తుత పరిస్థితి 

  • కోరుకొండ, అనపర్తిలలో మాత్రమే అగ్రి ల్యాబ్‌లు ప్రారంభమై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నమూనాల పరీక్షలు జరుగుతున్నాయి.
  • గోపాలపురంలో భవన నిర్మాణం పూర్తయినా ల్యాబ్‌ పరికరాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. 
  • నిడదవోలులో మాత్రం పూర్తిస్థాయిలో ల్యాబ్‌ ఏర్పాటు కాకపోవడంతో ఇక్కడ కేవలం విత్తనాల వరకే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
  • కుమారదేవం, పిడింగొయ్యిలో భవన నిర్మాణాలే ఇప్పటివరకు పూర్తికాలేదు. పనులు అసంపూర్తిగానే దర్శమిస్తున్నాయి. భవనాల స్లాబ్‌ పనులు పూర్తి చేసినప్పటికీ లోపల పనులు ఇంకా చాలా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్లాస్టింగ్, పెయింటింగ్, టైల్స్, తలుపులు, కిటికీల ఏర్పాటు, విద్యుత్తు సరఫరా వంటివి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం బిల్లులు మంజూరులో జాప్యం చేయడంతో ఏడాది కాలంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నమూనాలు అక్కడికి పంపాల్సిందే.. 

రాజమహేంద్రవరం గ్రామీణం, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాలకు సంబంధించి స్థానికంగా అగ్రి ల్యాబ్‌లు అందుబాటులోకి రాక విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇటు సిబ్బంది, అటు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో నమూనాలను పరీక్షల నిమిత్తం అనపర్తి, కోరుకొండ ల్యాబ్‌లకు పంపించాల్సి వస్తోందని వ్యవసాయ శాఖ సిబ్బంది చెబుతున్నారు. నిడదవోలులోని ల్యాబ్‌లో పూర్తిస్థాయిలో పరికరాలు అందుబాటులోకి రాకపోవడంతో కేవలం విత్తనాల వరకే ఇక్కడ నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల నమూనాలను అనపర్తి, కోరుకొండ ల్యాబ్‌లకు పంపించాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నకిలీ విత్తనాలు, ఎరువుల బెడదతో ప్రతి సీజన్‌లో నష్టపోయే పరిస్థితులున్నందున ఇకనైనా మిగతా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్‌లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని