‘ఆస్తి పన్ను పెంపు చట్ట విరుద్ధం’
గుంటూరు, న్యూస్టుడే: పట్టణ ప్రాంతాల్లో నివాస భవనాలు, స్థలాలపై పన్ను మదింపు విధానానికి స్వస్తి పలికి ఏపీ మున్సిపల్ చట్టం-2020 తీసుకురావడం చట్ట విరుద్ధమని ఆంధ్ర న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రాజారామ్ అన్నారు. గుంటూరు నగరం అరండల్పేటలోని ఓ హోటల్లో అవగాహన సంస్థ, ఆంధ్ర న్యాయవాదుల సంఘం సంయుక్తంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల అనుమతి ముందుగా తీసుకోకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా, అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే చట్టం చేశారని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసి న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆస్తి పన్ను ఏడాదికి 15 శాతం పెరిగినా ఏటా పెరిగే పన్నుతో 200-300 శాతం వరకు ఇంటి పన్నులు భవిష్యత్తులో పెరుగుతాయన్నారు. నూతన గృహాలకు 15 శాతం పెంపుదల వర్తించదన్నారు. గతంలో ఉన్న అద్దె ఆధారంగా పన్ను మదింపు చేసే విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర న్యాయవాదుల సంఘం కార్యదర్శి మేడా శ్రీనివాస్, పట్టణ గృహ యజమానుల సంఘం కార్యదర్శి పీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.