logo
Updated : 09 Aug 2022 06:51 IST

వర్షాలు తీన్మార్..ఇంటిటా బీమార్

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

జ్వరం, గొంతు, ఒంటి నొప్పులతో ఇబ్బంది

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు- హైదరాబాద్‌

మూడు రోజుల కిందట సీనియర్‌ జర్నలిస్టు ఒకరికి ఒకేసారి డెంగీ, కరోనా నిర్ధారణయ్యాయి. ప్లేట్‌లెట్లు తగ్గడంతో కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరగా, స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. మధుమేహం లేకపోయినా ఇన్సులిన్‌ చేశారు. దీంతో ఆయన మరో వైద్యుణ్ని ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు రోగులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నగరంలో 20 మందికి పైగా సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు వైరల్‌, డెంగీ, కరోనాలతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఇతర శాఖల్లోని పలువురు అధికారులు సెలవులు పెట్టి ఇంట్లోనే చిక్సిత పొందుతున్నారు.
నగరాన్ని వీడకుండా కురుస్తున్న వర్షాలు.. చిత్తడిచిత్తడి పరిసరాలు.. విజృంభిస్తున్న దోమల వల్ల రాజధాని వాసులను వైరల్‌, డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కిటికిటలాడుతున్నాయి. నగరంలోని ప్రతి ఇంటిలోనూ ఏదో రకం సీజనల్‌ వ్యాధితో బాధపడుతున్నవారు కన్పిస్తున్నారు. ఫీవర్‌, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ తదితర ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే ఓపీ 20-30 శాతం పెరిగింది. వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇస్టానుసారం యాంటీబయోటిక్స్‌ వాడొద్దని హెచ్చరిస్తున్నారు.
గతంలో కొవిడ్‌ బారినపడిన కొందరిలో రోగ నిరోధక శక్తి తగ్గడాన్ని గమనిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఇటువంటివారు త్వరగా వైరల్‌ జ్వరాల బారినపడుతున్నారు. దోమలూ అధికంగా ఉండడంతో డెంగీ విజృంభిస్తోంది. ప్లేట్‌లెట్స్‌ 50 వేల లోపునకు పడిపోతుండడంతో ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ప్రైవేటు ఆస్పత్రులు రూ.లక్షల గుంజుతున్నాయి.  

ఎలా గుర్తించాలి.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
* వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకితే తీవ్రమైన జ్వరంతోపాటు కాళ్లు, చేతులు మంటగా ఉంటాయి. చికిత్స తీసుకుంటే రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది. ఆ తర్వాతా తీవ్ర నీరసం ఉంటుంది. పిల్లలు నలతగా కన్పించకుండా, డీలా పడినట్లుంటారు. ముక్కు కారటం, జ్వరం, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్‌ వాయటం, దగ్గు, ఆయాసం, విరేచనాలు లక్షణాలు కన్పిస్తాయి. కరోనా సోకినా ఇలాంటి సమస్యలే ఉండడం వల్ల ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొనేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఇంట్లో ఒకరికొస్తే అందరికీ చుట్టబెడుతుంది. 3-4 రోజులు దాటినా జ్వరం తగ్గకపోతే డెంగీ లేదా మలేరియాగా అనుమానించి, పరీక్షలు చేయించుకోవాలి. చేతి శుభ్రత అవసరం. వేడివేడి ఆహారం తినాలి. కాచి వడబోసి చల్లార్చిన నీళ్లు తాగాలి.
* జ్వరం, తలనొప్పి, విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు ఉంటే టైఫాయిడ్‌ పరీక్ష అవసరం.
* బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలో జ్వరం క్రమేపీ పెరుగుతూ 3, 4 రోజులకు తారస్థాయికి చేరుతుంది. చాలా నలతగా, జబ్బు పడినట్లుగా కన్పిస్తారు. ముఖకవళికలు మారిపోతాయి.
* దోమల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంటిచుట్టూ, పూల కుండీల్లో నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. దోమ తెరలు, సంహరణ మందులు వాడాలి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని