Telangana News: అంబర్‌పేటలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్‌బోర్డు కీలక ఆదేశాలు

అంబర్‌పేట పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని...

Updated : 19 Aug 2022 19:32 IST

హైదరాబాద్‌: అంబర్‌పేట పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని ప్రిన్సిపల్‌ గదికి వెళ్లిన ఓ విద్యార్థి నాయకుడు తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ మీద పోసుకున్నాడు. పక్కనే దీపం ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్‌, పాలనా అధికారికి గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఇంటర్‌ బోర్డు కీలక ఆదేశాలు..

అంబర్‌పేట ప్రైవేటు కళాశాల ఘటన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్‌దేనని స్పష్టం చేశారు. కారణమేదైనా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని హెచ్చరించారు. 
సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్‌ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రైవేటు కాలేజీలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని