డ్వాక్రా మహిళలే కీలకం!

జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.

Updated : 27 Apr 2024 06:34 IST

ప్రత్యేక సమావేశాలతో నేతల అభ్యర్థన

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ : జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. వీరంతా పొదుపు చేయడం...రుణాలు స్వీకరించడం...వాయిదాలు చెల్లించడం..నెలనెలా సమావేశాలు నిర్వహించడం నిరంతరంగా చేస్తుంటారు. ఇంతవరకే వీరి పాత్ర పరిమితం అనుకుంటే పొరపాటే. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపొటముల్లోనూ వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకుంటే విజయం సాధించడం సునాయాసమవుతుందని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. ఆ దిశగా పావులు కదుపుతుంటాయి. ఈక్రమంలోనే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వీరివైపు చూస్తున్నాయి.  

నాయకులతో మొదలైన మంతనాలు

ప్రధాన పార్టీల అభ్యర్థులు పొదుపు మహిళల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు సంఘాల నాయకులతో మంతనాలు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం తాండూరులోని ఓ వేడుక వేదికలో ఓ జాతీయ పార్టీ అభ్యర్థి తన అనుచరులతో కలిసి పొదుపు మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ పార్టీ మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాలు, కార్యక్రమాలను వివరించి, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తే అమలు చేసే సంక్షేమాలు, ప్రగతి గురించి తెలియజేస్తూ  తమ పార్టీ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. సభ్యులందరినీ ఒప్పించి ఓట్లు రాబట్టుకునే బాధ్యతల్ని ఆయా సంఘాల లీడర్లకు కట్టబెడుతున్నారు. కొందరు ప్రచారానికి వచ్చేందుకు నిరాకరిస్తూ ఓటు వేసేందుకు అంగీకరిస్తుండగా వారికి తాయిలాలూ ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారని సమాచారం. పొదుపు సంఘం సభ్యురాలిని ఒప్పిస్తే ఆ ఇంట్లోని ఓట్లన్నీ తమకే వస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు.

నైతిక ఓటింగ్‌పై అవగాహన

సమర్థులైన అభ్యర్థులకే ఓటు వేసేలా మహిళా సంఘాల సభ్యులకు నైతిక ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం  ప్రాధాన్యం ఇస్తోంది. స్వీప్‌లో భాగంగా గ్రామైక్య సంఘం, పొదుపు సంఘం సమావేశాల్లో ఈ అంశం పొందుపరిచారు. ప్రలోభాలకు తలొగ్గి అసమర్థులకు ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు ఇబ్బందులుపడాల్సి వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు