logo

పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు

వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలోనే పాలమూరులో    రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 03:21 IST

సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కూడలి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి. చిత్రంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీహరి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

ఈనాడు, మహబూబ్‌నగర్‌-పాలమూరు, న్యూస్‌టుడే: వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలోనే పాలమూరులో    రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి రూ.30వేల కోట్లు రాబట్టేలా పోరాటం చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు సందర్భంగా సీఎం శుక్రవారం మహబూబ్‌నగర్‌కు వచ్చారు. క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్వాల గడీల నుంచి ఓ దొరసాని మహబూబ్‌నగర్‌ వచ్చారని వారి కాళ్ల వద్ద ఇంకా బతుకుదామా? అని ప్రశ్నించారు. ఆ దొరసాని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలైందిగానీ పాలమూరు పథకానికి జాతీయ హోదా మాత్రం తీసుకురాలేదని డీకే అరుణను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆమెకు పదవులొస్తే ఆ కుటుంబానికే మేలు జరుగుతుందని ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరును ఎడారిగా మార్చాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో భారాస, భాజపా ఒక్కటై కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర  రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పాలమూరు మట్టిపని, తట్టపని గుర్తుకొచ్చేవన్నారు. ఇప్పుడు తాను ఇతర రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తున్నానని, పాలమూరు పౌరుషం ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. ఈ ప్రాంతానికి కనీసం పరిశ్రమలను కూడా తీసుకురాలేదన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే అందులో 150 పోస్టులకు 120 ఖాళీగా ఉంచారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే చిన్నారెడ్డికి ప్లానింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను, ఒబేదుల్లా కొత్వాల్‌కు మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను ఇచ్చుకున్నామని గుర్తు చేశారు. ఆగస్టు 15 లోగా ముదిరాజ్‌ బిడ్డను మంత్రిని చేస్తామని తెలిపారు. నల్లమల బిడ్డగా ఈ ప్రాంత గాలి, నీరు, నేల నాది అన్నారు. ఈ ప్రాంతానికి ఏమైనా జరిగితే నాకున్న బాధ ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. తాను రాజైనా పాలమూరుకు బిడ్డనే అని చెప్పారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవిలను గెలిపించాలన్నారు.

ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ వచ్చిన ఈ మూడు నెలల్లో పాలమూరుకు మక్తల్‌-నారాయణపేట- కొడంగల్‌ ఎతిపోతల పథకం, మహబూబ్‌నగర్‌లో ఇంజినీరింగ్‌, న్యాయ కళాశాలలను మంజూరు చేసుకున్నామన్నారు. సారా వైపు ఉంటారా.. సాగునీరు అందించే వైపు ఉంటారా? పార్టీలు మార్చే రాజకీయ అవకాశవాదుల వైపు ఉంటారా.. పార్టీ కోసం ప్రాణాలిచ్చే వారి పైపు ఉంటారా? అంటూ భాజపా అభ్యర్థి డీకే అరుణనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు అవకాశం ఇస్తే దిల్లీలో పాలమూరు ప్రజల గొంతు వినిపిస్తానన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో భాజపాకు ఓటేస్తే సారా, ఇసుక, క్రషర్‌, భూకబ్జాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్నికరెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శంకర్‌, ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ క్లాక్‌టవర్‌ వద్ద  కూడలి సమావేశానికి హాజరైన జనం


రోడ్‌ షో..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మెట్టుగడ్డ నుంచి సీఎం ర్యాలీ ప్రారంభమైంది. ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వస్తుండటంతో ఉదయం 9 గంటలకే మెట్టుగడ్డ చౌరస్తాలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు చేరుకున్నారు. చౌరస్తా కిక్కిరిసిపోయింది. క్లాక్‌టవర్‌ వద్ద ముఖ్యమంత్రికి ముదిరాజ్‌లు చేపను బహూకరించారు. బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని చెప్పడంతో ముదిరాజ్‌లు హర్షం వ్యక్తం చేశారు. సభలో వంశీచంద్‌ ప్రసంగిస్తుండగా మజీదు నుంచి నమాజ్‌ ప్రారంభం కావడంతో ప్రసంగం ఆపారు. నమాజ్‌ ముగియగానే మళ్లీ ప్రసంగం ప్రారంభమైంది. సభ ముగిసిన అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి సీఎంతో కలిసి వంశీచంద్‌రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని