logo

2వ రోజు.. 17 నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి.

Published : 20 Apr 2024 03:50 IST

సికింద్రాబాద్‌ స్థానానికి భాజపా అభ్యర్థిగా కిషన్‌రెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు.

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ కలెక్టరేట్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి.

  •  సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి జి.కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రిటర్నింగ్‌  అధికారి హేమంత్‌ పటేల్‌కు నామినేషన్‌ పత్రాన్ని అందించారు. భారాస తరఫున ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్‌ నామినేషన్‌ వేశారు. ఆర్‌.గంగాధర (సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా- కమ్యూనిస్ట్‌) కొలిశెట్టి శివకుమార్‌ (యుగతులసీ పార్టీ), బీరంగంటి సునీతారాణి (సోషలిస్ట్‌ పార్టీ -ఇండియా), స్వతంత్ర అభ్యర్థిగా చలిక చంద్రశేఖర్‌ (స్వతంత్ర) నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.
  • హైదరాబాద్‌ స్థానం నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ లక్డీకాపూల్‌లోని ఆర్వో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టికి నామపత్రం సమర్పించారు.
  • చేవెళ్ల లోక్‌సభకు భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ తరఫున భిక్షపతి నామినేషన్‌ దాఖలు చేశారు. బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ) అభ్యర్థిగా వనం సుధాకర్‌, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ పార్టీ అభ్యర్థిగా మహ్మద్‌ చాంద్‌పాషా నామపత్రాలు సమర్పించారు.
  • మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థుల నుంచి ఆరు నామినేషన్లు స్వీకరించినట్లు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఓరుగంటి వెంకటేశ్వర్లు,  పెండ్యాల శేషసాయి వరప్రసాద్‌, రాజేశ్‌ మిశ్రా శివ్‌, చలిక చంద్రశేఖర్‌ ఒక్కొ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. వి.వి.ఎస్‌ నారాయణ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఇచ్చారని అధికారులు తెలిపారు

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నామపత్రం సమర్పించారు. శ్రేణులతో తరలివెళ్లారు.
నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పాతబస్తీలో సందడి నెలకొంది.

జాగ్రత్తగా నింపాలి: రోనాల్డ్‌రాస్‌

నామపత్రాల దాఖలుపై అభ్యర్థులు పత్రాల్లో అడిగిన అన్ని వివరాలను జాగ్రత్తగా రాయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నామినేషన్‌ దాఖలు సమయ వేళలు, దరఖాస్తులను నింపడం, ఇతర అంశాలపై పార్టీలకు సూచనలు చేశారు.

  • సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఎంపీ స్థానాల ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్‌శుక్లా, సెంథిల్‌కుమారన్‌ శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.

దీర్ఘకాలిక సెలవులు రద్దు

ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది కొరత వల్ల   దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఆర్వో రోనాల్డ్‌రాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సెలవులో ఉన్న వారు వెంటనే విధుల్లో చేరాలని, విదేశీ ప్రయాణాల కు అనుమతి పొందిన వారికీ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.

ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి

పార్టీలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, లోకల్‌ కేబుల్‌, సోషల్‌ మీడియా, ఆడియో, ఎఫ్‌ఎం రేడియో, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వీడియో మెసేజ్‌లు, కరపత్రాల ప్రచురణ, థియేటర్ల ద్వారా ప్రకటనలకు 48 గంటల ముందు మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని రోనాల్డ్‌రాస్‌ స్పష్టం చేశారు. .

సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థి టి.పద్మారావు నామపత్రం సమర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మాగంటి గోపినాథ్‌ ఉన్నారు. ఆర్వో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తరువాత ఇలా గెలుపు ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని