logo

హెచ్‌ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది.

Published : 03 May 2024 03:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు విచారించినట్లు తెలుస్తోంది. ఇటీవల హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతడిపై కేసు నమోదు తర్వాత పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. అనుమతుల కోసం తమ వద్ద రూ.కోట్లలో వసూలు చేసినట్లు ఏసీబీ దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో పుప్పాలగూడలోని ఓ భూమిలో భవన నిర్మాణ అనుమతులకు పెద్దమొత్తం వసూలులో.. శివబాలకృష్ణతోపాటు  ఆ కీలకాధికారి ప్రమేయంపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో కొత్త కేసుగా దీనిని నమోదు చేసి ఆధారాల సేకరణకు దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు నిజమని తేలితే అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.  


నామినేషన్‌ తిరస్కరణలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌: మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి న్యాయవాది కె.వి.గీతాకుమారి నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్‌ దాఖలులో లోపాలను సరిదిద్దినా ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ ఎన్నికల వ్యయం నిమిత్తం ప్రత్యేక బ్యాంకు ఖాతా వివరాలను, ఫొటోలను, ఫాం-ఎ అసమగ్రంగా పూర్తి చేయడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిపారు.


ఏడున్నరేళ్లు భారాసలో పంజరంలో పక్షిలా ఉన్నా: దానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘భారాసలో ఏడున్నరేళ్లు పంజరంలో పక్షిలా ఉన్నా.. నాతో పాటు నడిచే కార్యకర్తలకు న్యాయం  చేయలేకపోయా.. కాంగ్రెస్‌లోకి వచ్చిన తరువాత స్వతంత్రం వచ్చినట్లుంది’ అని సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. గురువారం హిమాయత్‌నగర్‌ వై.జంక్షన్‌ వద్ద డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, కార్పొరేటర్‌ గడ్డం మహాలక్ష్మిగౌడ్‌, పార్టీ నాయకుడు జి.రామన్‌గౌడ్‌లతో కలిసి సికింద్రాబాద్‌ నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసీఫ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి తన రాజకీయ జీవితం మొదలైందని, ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. భారాసలో ఉన్నప్పుడు కార్యకర్తలకు, ఓటర్లకు ఏదైనా సమస్య వచ్చి తనను ఆశ్రయిస్తే.. అధికారులు, వైద్యులకు సహాయం చేయమని కోరినప్పుడు ముఖ్యమంత్రి లేఖ ఉందా? కేటీఆర్‌కు చెప్పారా? అనే అడిగేవారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. కిషన్‌రెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటించారన్నారు.
 


హజ్‌ యాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి

నాంపల్లి, న్యూస్‌టుడే: హజ్‌ యాత్ర- 2024కు ఎంపికైనవారు యాత్రలో నిబంధనలు తప్పకుండా పాటించాలని పలువురు ముస్లిం మతగురువులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మహ్మద్‌ సలీం నేతృత్వంలో గురువారం నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌హాల్‌ వేదికగా హజ్‌ యాత్రికులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. జామియా నిజామియా మతగురువు ముఫ్తీ సయ్యద్‌ జియాఉద్దీన్‌నక్‌్్షబందీ, డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ మజీబ్‌, ఆమీర్‌ ఎ మిల్లత్‌ ఇస్లామియా మహమ్మద్‌ హుసాముద్దీన్‌ సానిజాఫర్‌పాషా, సయ్యద్‌షా నామత్‌ఉల్లాఖాద్రీ, మహమ్మద్‌ అబ్దుల్‌ రహీం ఖుర్రం, మక్కామసీదు ప్రతినిధులు డాక్టర్‌ రిజ్వాన్‌ఖురేషీ, హామెద్‌మహమ్మద్‌ఖాన్‌, సియాసత్‌ ఎడిటర్‌ ఆమిర్‌అలీఖాన్‌, హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఇర్ఫాన్‌షరీఫ్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల హజ్‌హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం హజ్‌ శిబిరం నిర్వహిస్తుందని, 9వ తేదీన సౌదీకి తొలి విమానం బయలుదేరుతుందని చెప్పారు. ఈసారి కూడా తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ యాత్రికులు కూడా హైదరాబాద్‌ హజ్‌ టెర్మినల్‌ నుంచే హజ్‌యాత్రకు బయలుదేరుతారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని