logo

సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె

ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి.

Updated : 17 May 2024 05:22 IST

ధాన్యం సేకరణ కేంద్రాల్లో టార్పాలిన్లకూ కొరతే..

తాండూరు  కొనుగోలు కేంద్రంలో ఆరుబయటే బస్తాలు

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, తాండూరు గ్రామీణ, తాండూరు, ధారూర్‌, మోమిన్‌పేట, యాలాల: ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. జిల్లాలోని పలు కేంద్రాల్లో ఆరుబయటే రైతులు ధాన్య రక్షణకు పడుతున్న వెతలు  అన్నీ ఇన్నీకావు. ప్రతి కేంద్రంలో తాడిపత్రులు (టార్పాలిన్లు) అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నా అనేకచోట్ల అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

చిరిగిన బస్తాలే దిక్కు: యాసంగి సాగుకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం 124 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం 12,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాకు వాస్తవంగా 30లక్షల గోనెసంచులు అవసరం ఉండగా ఇప్పటివరకు 20లక్షల మేరకు సరఫరా జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో కొరత లేకుండా చూస్తున్నామని చెప్పినా చిరిగిన సంచులే పంపిణీ చేశారు.  

ఇళ్లనుంచి తెచ్చిన వాటినే కప్పుతున్నారు

యాలాల మండలం పగిడిపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులు ఇళ్ల నుంచి వెంట తీసుకు వచ్చిన టార్పాలిన్లనే సాయంత్రం కాగానే బస్తాలపై కప్పుతున్నారు. దీనికి తోడు గోనె సంచులు అందుబాటులో ఉండటంలేదు. తూకం పూర్తయిన ధాన్యం గోదాంలకు తరలించేందుకు అవసరమైన లారీలు కూడా కేంద్రానికి రావడం లేదు. వీటికోసం  రాత్రికి అక్కడే ఉండాల్సి రావడంతో ఆహారానికి, వసతికి అవస్థలు పడుతున్నారు.  ః మోమిన్‌పేట కొనుగోలు కేంద్రం రైతులకు కొంత మేర లాభదాయకంగా మారింది. విక్రయాలకు బహిరంగ విపణులకు తరలించే సమయంలో ఎదురయ్యే రవాణా ఇబ్బందులు, ఛార్జీల భారం తగ్గుతుందని కొందరు రైతులు తెలిపారు.  ః ధారూర్‌ మండల పరిధిలో గతంలో ఎదురైన అవస్థలను దృష్టిలో ఉంచుకొని గోనె సంచుల కొరత లేకుండా చూస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నా కార్యాచరణ లేదు.


కొత్త బస్తాలు పంపిణీ చేయాలి
- జి.శ్రీనివాస్‌, రైతు, బాస్‌పల్లి

చిరిగిన బస్తాలు కాకుండా కొత్త వాటిని సరఫరా చేయాలి. రెండుమూడేళ్లుగా చిరిగినవే అందుతున్నాయి. పొలాలు, ఇళ్లవద్దే తూకం వేసుకుపోవాల్సి రావడం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.


మౌలిక సౌకర్యాలు కల్పించాం
- రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

అన్ని కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాం. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా చిరిగిన బస్తాలు వస్తే బాగున్నవి పంపిస్తాం. వాతావరణ సూచన తెలిపే యాప్‌ ప్రతి కేంద్రంలో ఉండటంతో నిర్వాహకుల ద్వారా ముందుస్తు సమాచారం అందజేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని