logo

అడుగడుగునా నీరాజనం

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి జిల్లా పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది. పార్టీ విధానాలు...భవిష్యత్తు వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కడప నగర శివారులోని ఓ కల్యాణమండపంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో

Published : 19 May 2022 03:54 IST

జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పర్యటన

కష్టపడి పనిచేసేవారికే రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తాం

ముఖ్యమంత్రి జగన్‌పై ఘాటైన విమర్శలు

పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం

 

మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కమలాపురం, మైదుకూరు, అరవిందనగర్‌(కడప) : తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి జిల్లా పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది. పార్టీ విధానాలు...భవిష్యత్తు వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కడప నగర శివారులోని ఓ కల్యాణమండపంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మూడేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి జగన్‌ సంపదంతా దోచుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. వైకాపాపై తెదేపా చేస్తున్న పోరాటంలో యువత కదిలిరావాలన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తెదేపాను గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘వైకాపాకు రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బులతో లోటు లేదు. అన్ని శక్తులున్నప్పటికీ జనం మాత్రం లేరు. ప్రజలకు మించిన శక్తి ఏదీ లేదు. ఇప్పుడు ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీరిదిద్దడమే ముందున్న లక్ష్యం. నియంతృత్వ సర్కారు కాదు.. రైతులు.. పేదలతో సహా ప్రతి వ్యక్తికి భాగస్వామ్యం కల్పించే సర్కారును తీసుకురావాలనే సంకల్పంతో మీముందుకు వచ్చాను’ అని వివరించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అక్కడ నుంచి చెన్నూరు, ఖాజీపేట మండలాల మీదుగా కమలాపురం చేరుకున్న ఆయనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

అప్పులతో పాలన సాగించలేక.. వైకాపా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని... రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్న చంద్రబాబు.. అందుకు నాయకత్వం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘తన చుట్టూ తిరిగితే పార్టీ టిక్కెట్లు రావు. క్షేత్ర స్థాయిలో మకాం వేసి ఓటర్లలో పార్టీపై విశ్వాసం కల్పించాలి. నేతల పనితీరు ప్రాతిపదికనే టిక్కెట్లు కేటాయిస్తాం. పనిచేసేవారికి, ప్రజల్లో ఉండేవారికి ఇస్తాం. ఎంత సీనియర్‌ అయినా, ఎంతటి చరిత్ర ఉన్నా పని చేయకుంటే టిక్కెట్‌ ఇచ్చేది లేదు. ప్రజలు ఎవర్ని కోరుకుంటున్నారో.. ఎవరైతే జనం మధ్య ఉంటారో వారికే ప్రతిఫలం లభిస్తుంది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్‌పై విమర్శలకు విశేష స్పందన

సీఎం జగన్‌పై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ కుటుంబసభ్యులు ఇష్టానుసారంగా భూకబ్జాలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. ‘వైఎస్‌ కొండారెడ్డి 400 ఎకరాలు, వైఎస్‌ మధుసూదన్‌రెడ్డి 300 ఎకరాలు, బద్వేలులో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి 800 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రజల నుంచి కాజేసిన భూములను తిరిగి ఇప్పించి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భూములను ఆక్రమించినవారు ఎక్కడున్నా కేసులు పెట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారన్న సమయంలో జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ఓ వ్యక్తి ‘జే’ బ్రాండ్‌ మద్యం అంటూ చంద్రబాబు చేతికి అందించి ఆశ్చర్యపరిచారు. దమ్ముంటే మాజీ మంత్రి వివేకా హంతకులను బయట పెట్టాలని డిమాండు చేశారు. అక్రమాస్తుల కేసులో ఎ-1, ఎ-2 కేసును వాదిస్తున్న వ్యక్తికి రాజ్యసభ సీటిచ్చారని ఎద్దేవా చేశారు.

ఆద్యంతం ఆకట్టుకున్న రోడ్‌షో

చంద్రబాబునాయుడు రోడ్‌షో కడప నుంచి కమలాపురం వరకు సాగింది. పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావడంతో చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత స్పందన మొదటిసారి చూస్తున్నానంటూ కొనియాడారు. పార్టీ కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల బాధ్యులు పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పలువురు నాయకులు వాహనంపై చంద్రబాబుతో ఉన్నారు. చెన్నూరు, ఖాజీపేట మీదుగా కమలాపురం వరకు చంద్రబాబు రోడ్‌షోగా వెళ్తారన్న సమాచారంతో పెద్దఎత్తున కార్యకర్తలు, పార్టీ అభిమానులు సరిహద్దులోని చెన్నూరు వంతెన వద్దకు చేరుకున్నారు. తెదేపా జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. కాన్వాయ్‌ వెంట వాహనాలతో ముందుకు కదిలారు. దారి పొడువునా గ్రామాల వద్ద రోడ్లపైకి చేరిన ప్రజలు వాహనంపై నిలిచిన చంద్రబాబుకు చేతులు ఊపుతూ అభిమానం చాటుకున్నారు. అందుకు ప్రతిగా చంద్రబాబు అభివాదం చేస్తూ, విజయ సంకేతం చూపిస్తూ ముందుకు సాగారు. పాటిమీదపల్లె చంద్రబాబుకు హారతులు పట్టారు. ఖాజీపేట మూడు రోడ్ల కూడలిలో క్రేన్‌ సాయంతో గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఖాజీపేటలో రోడ్డు షోకు తరలివచ్చిన జనం

రోడ్డుషోలో పాల్గొన్న చంద్రబాబు, తెదేపా నాయకులు

కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి తరలివచ్చిన జనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని