మహిళా ఆవిష్కర్తలు పెరగాలి

మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

Published : 27 Apr 2024 01:58 IST

పేటెంట్ల అధిక నమోదు జరగాలి
వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌ రంగాలపై దృష్టి అవసరం
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచన
ఈనాడు - హైదరాబాద్‌

మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. 2019-2021 మధ్యకాలంలో మనదేశంలో దాఖలైన పేటెంట్‌ దరఖాస్తుల్లో మహిళల వాటా 10.2 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. మహిళలు సహజసిద్ధమైన పరిశోధకులని చరిత్రలో ఏనాడో నిర్ధారణ అయింది. మహిళలను విస్మరించిన ఏ రంగంలోనూ ఆశించిన రీతిలో పురోగతి సాధ్యం కాదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేధో సంపత్తి(ఐపీఆర్‌) దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలో హిందాల్కో గ్రూపు నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రధానోపన్యాసం చేశారు.

యువ జనాభాతో ఆవిష్కరణలు

1980 ప్రాంతంలో పేటెంట్లు అన్నీ అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు మనదేశం ఆవిష్కరణల్లో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ‘2014- 23 మధ్య కాలంలో మనదేశం 4.65 లక్షల పేటెంట్లు దాఖలు చేసింది. 2023లో రోజుకు 247 పేటెంట్‌ దరఖాస్తులు దాఖలు చేయటం ప్రత్యేకత. పేటెంట్లలో మనదేశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌’లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 40వ స్థానానికి చేరుకుంది’ అని తెలిపారు. అయినా ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మొత్తం జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు 60 శాతం ఉన్న మనదేశంలో మున్ముందు ఎంతో అధికంగా ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కంప్యూటర్స్‌, బయోమెడికల్‌, రసాయన శాస్త్రం, యంత్ర పరిశోధనల నుంచే కాకుండా వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌, వ్యర్ధాల నివారణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల నుంచి అధిక పేటెంట్లు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

సంప్రదాయాలను విస్మరించకుండానే కొత్తవి కనుక్కోవాలి..

మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్యం, ఆర్థిక అసమానతలు, మహిళా సాధికారత.. మనదేశంలో పెద్ద సవాళ్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మనదేశంలో యువత ఈ సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని కొత్త ఉత్పత్తులు, సేవలు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ‘10వ తరగతి విద్యార్ధి ఒకరు గుండెపోటును పసిగట్టే ‘స్కిన్‌ ప్యాచ్‌’ను అభివృద్ధి చేస్తున్నట్లు నిన్ననే ఒక చోట చదివాను. ఇది అద్భుతమైన ఆవిష్కరణ’ అని ఆయన అన్నారు. మనదేశంలో లోహాలు, దుస్తులు, నీటి నిల్వ, ప్లాస్టిక్‌ సర్జరీ... తదితర విభాగాల్లో ఎన్నో పురాతన ఆవిష్కరణలు ఇప్పటికీ వినియోగంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జపాన్‌లో ‘ఒరిగామి’ కళాకారులు ఒక సాధారణ కాగితంతో అద్భుతమైన ఆకృతులు సృష్టిస్తారని, ఈ కళ ఎంతో మంది ఆవిష్కర్తలు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, బయాలజిస్ట్‌లకు స్ఫూర్తినిస్తోందని అన్నారు. అందువల్ల కొత్తవి కనుక్కోవటమంటే చరిత్రను, సంస్కృతీ సంప్రదాయాలను పూర్తిగా విస్మరించటం కాదన్నారు.

ప్రభుత్వం, కోర్టులు కీలకం..

నూతన ఆవిష్కరణలకు సామాజిక ప్రయోజనం పునాదిగా ఉండాలని, లేనిపక్షంలో అటువంటి ఆవిష్కరణలు దీర్ఘకాలం పాటు మనుగడ సాగించలేవని జస్టిస్‌ రమణ వివరించారు. ఈ ఆలోచనతోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో న్యాయవ్యవస్థలో తాను ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కొవిడ్‌- 19 సమయంలో కోర్టుల్లో ‘ఆన్‌లైన్‌’ విచారణలు చేపట్టినట్లు తెలిపారు. ఫాస్టర్‌ అనే వ్యవస్థను తీసుకొచ్చి బెయిలు ఆర్డరును నేరుగా జైలుకు పంపడం ద్వారా నిందితులను వేగంగా విడుదల చేసే అవకాశం కల్పించామన్నారు. అందరికీ ఉపయోగపడే ఆవిష్కరణలే, పరిశోధకుల లక్ష్యం కావాలని ఆయన అన్నారు. పరిశోధనలు- ఆవిష్కరణలకు పెద్దపీట వేసే క్రమంలో మేధో సంపత్తి హక్కులను పరిరక్షించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం, కోర్టులు క్రియాశీలకమైన పాత్ర పోషించాలని సూచించారు.

హిందాల్కో గ్రూపు అల్యూమినియం ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ విభాగాల్లో ఎన్నో ఆవిష్కరణలు తీసుకువచ్చిందని కొనియాడారు. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని, సాంకేతిక భాగస్వామ్యాలు కుదుర్చుకుందని తెలిపారు. సాంకేతిక రంగంలో మనదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టటానికి హిందాల్కో ఉద్యోగులు కృషి చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని