సమన్వయంతో సభ్యత్వ నమోదు లక్ష్యం పూర్తి
కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిరంజన్
సమావేశంలో మాట్లాడుతున్న నిరంజన్, చిత్రంలో పార్టీ నేతలు విజయరమణారావు,
శ్రీధర్‌బాబు, కొమురయ్య, వినోద్, వేణుగోపాల్‌రావు
పెద్దపల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు సమన్వయంతో పని చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి నిరంజన్ సూచించారు. పీసీసీ ప్రధానకార్యదర్శి హర్కాల వేణుగోపాల్‌రావు అధ్యక్షతన శనివారం పెద్దపల్లిలో నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నిరంజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి మొబైల్ యాప్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. మొదట మండల అధ్యక్షుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలని, అనంతరం బూత్ స్థాయిలో సభ్యత్వం కల్పించే వారి పేర్లను నమోదు చేయాలన్నారు. ఒక్కో బూత్‌లో 100 నుంచి 200 సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ ప్రక్రియలో నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత దూషణకు పాల్పడవద్దన్నారు. శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వరి సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించారు. వెంటనే వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, యాసంగి కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. డిజిటల్ సభ్యత్వ నమోదుపై డీసీసీ, డివిజన్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ దీపక్‌జాన్, మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, సంజీవరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.